ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన వేళ ట్రంప్ తాజా ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. యుద్ధాన్ని ముగించే దిశగా ఆలోచిస్తున్నామని, తమ లక్ష్యాలకు చేరువయ్యామని ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్‌తో యుద్ధం వల్ల ఇప్పటికే అమెరికాకు 11 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు అవ్వడం, పసిఫిక్, గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా సైనిక సంపత్తికి నష్టం వాటిల్లడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధాన్ని అనంతంగా పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని, అందుకే తమ లక్ష్యాలు నెరవేరాయి అనే సాకుతో గౌరవప్రదంగా వెనక్కి తగ్గాలని ట్రంప్ భావిస్తున్నారు. అంటే, ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచడం ద్వారా తాము అనుకున్నది సాధించామని ప్రపంచానికి చాటిచెప్పడం ఆయన వ్యూహం.
అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పనిచేసే ట్రంప్, తన దేశ సైనికులను అనవసర యుద్ధాల్లో బలి చేయడం ఇష్టం లేదని గతంలోనూ చెప్పారు. ఇరాన్ అగ్రనేతలు హతమవ్వడం, వారి క్షిపణి వ్యవస్థలు కొంతమేర దెబ్బతినడంతో ఇరాన్ దూకుడు తగ్గిందని ఆయన నమ్ముతున్నారు. ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ, శాంతిని నెలకొల్పే డీల్ మేకర్ గా తన ఇమేజ్ను పెంచుకోవాలని చూస్తున్నారు. యుద్ధం వల్ల పెరిగే చమురు ధరలు అమెరికా ఓటర్లపై ప్రభావం చూపకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరితే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఐరోపా దేశాలు, అరబ్ మిత్రదేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేయడం కంటే, దాన్ని నియంత్రణలో ఉంచడమే మేలని వ్యూహకర్తలు సూచిస్తున్నారు. ట్రంప్ తన ప్రకటన ద్వారా ఇరాన్‌కు ఒక రకమైన ఎగ్జిట్ రూట్ ఇస్తూనే, తమ సైనిక ఆధిపత్యం నిరూపితమైందని సందేశం పంపారు. ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తుందన్నదానిపైనే యుద్ధం కొనసాగుతుందా.. ఆగుతుందా అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


