రోమ్ తగలబడుతూంటే.. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నారని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాదాపుగా అదే చేస్తున్నారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్ అయి నెల రోజులు దాటిపోయింది. ఇది అమెరికా చరిత్రలో అతి దీర్ఘకాలిక షట్డౌన్గా మారింది. నవంబర్ 7న సెనెట్‌లో షట్‌డౌన్ ముగించేలా ఒక బిల్‌పై ఓటింగ్ జరగనుందని ప్రకటించారు. కాని అది ఏకపక్ష ప్రకటన. డెమోక్రాట్లు ప్రభుత్వ షట్ డౌన్‌ను తాత్కలికంగా అయినా ఆపడానికి సబ్సిడీలు లేకుండా ఒక తాత్కాలిక ఫండింగ్ బిల్ ను ప్రతిపాదించారు. కానీ ట్రంప్ అంగీకరించడం లేదు.
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెనేటర్లను వాషింగ్టన్లో ఉండమని, షట్‌డౌన్ ముగించే వరకు వెళ్లవద్దని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. షట్‌డౌన్ ముగించడానికి కాంగ్రెస్ ఫండింగ్ బిల్ లేదా సిఆర్‌ను ఆమోదించి, ప్రెసిడెంట్ సంతకం చేయాలి. ఇది జరగకపోతే, ప్రభుత్వ సేవలు మరింత దెబ్బతింటాయి. షట్‌డౌన్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల 14 లక్షల మంది సివిల్ ఫెడరల్ ఉద్యోగుల్లో సగం మంది అన్‌పెయిడ్ లీవ్ మీద ఉండాల్సి వస్తోంది. మిగిలినవారు అవసర సేవలకు పని చేస్తున్నారు కానీ జీతం లేకుండా పని చేస్తున్నారు తర్వాత చెల్లిస్తామన్న హామీ కూడా లేదు.
సంక్షేమం కూడాఆగిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు జీతం లేకుండాపని చేస్తున్నారు. వేలాది ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. నేషనల్ మ్యూజియంలను మూసివేశారు. ఆరోగ్య, వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఆగిపోయాయి. మేరీలాండ్, లూసియానా వంటి రాష్ట్రాలు ఎమర్జెన్సీలు ప్రకటించి సహాయం అందిస్తున్నాయి. కానీ ట్రంప్ డయాబెటిస్ ఉన్న వాళ్లను అమెరికాలోకి రాకుండా ఉత్తర్వులు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ట్రంప్ దెబ్బతిన్నారు. వచ్చే ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికలలోనూ ఆయనకు ఎదురు దెబ్బలు తగలడం ఖాయంగా కనిపిస్తోంది.కానీ ఆయన మాత్రం పంతం మీదనే ఉన్నారు. అమెరికన్లకు నరకం చూపిస్తున్నారు.