ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీకి ఇప్పుడు ఏ దారి లేకుండా పోయింది. రష్యా కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. జెలెన్స్కీకి మరో దారి లేదని ఆయన రష్యా చెప్పినట్లుగా విని యుద్ధం ఆపేయాలని అంటున్నారు. అంటే రష్యా కోరుకుంటున్న భూభాగాన్ని ఆ దేశానికి ఇచ్చి పాహిమాం అంటే అప్పుడు వదిలేస్తారన్నమాట. నిజంగా ఇదే చేయాలనుకుంటే ఎప్పుడో చేసేసి యుద్ధం ఆపేసేవాళ్లమని జెలెన్ స్కీ గొణుక్కుంటూ ఉండవచ్చు. కానీ ట్రంప్ ఇప్పుడు అదే వాదన వినిపిస్తున్నారు.
అసలు ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేసింది.. అమెరికా నేతృత్వంలోని నాటో వల్లే. రష్యాకు పోటీగా ఉక్రెయిన్ ను బలపర్చేందుకు నాటో దేశాలు ప్రయత్నించాయి. నార్లు చేర్చుకుంటామని ఆశ పెట్టాయి. నాటో దేశాల కూటమిలో చేరితే ఉక్రెయిన్ కు ఆయా దేశాల సైనిక సాయం లభిస్తుంది. అందుకే.. ఉక్రెయిన్ అలా నాటోలో చేరక ముందే రష్యా దాడులు చేసింది. రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత నాటో దేశాలన్నీ సర్దుకున్నాయి. ఉక్రెయిన్ కు కావాలంటే. బాంబుల సాయం చేస్తాం కానీ.. ఆ దేశం కోసం తాము యుద్ధంలోకి దిగబోమని చెప్పాయి. ఫలితంగా ఉక్రెయిన్ ఇప్పటికీ యుద్ధం చేయాల్సి వస్తోంది.
ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఆ సాయం కూడా అమెరికా నుంచి ఆగిపోతోంది. రష్యా చెప్పినట్లుగా చేసి యుద్ధం ఆపేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పుతిన్ ఎలాగూ మాట వినడు కాబట్టి.. తమ సాయం పొందుతున్న ఉక్రెయిన్ ను భయపెట్టి పుతిన్ డిమాండ్లకే అంగీకరించేలా చేసి యుద్ధం ముగించేలా చేయాలనుకుంటున్నారు. తన నోబెల్ బహుమతి డిమాండ్ కు మరింత బలం వస్తుందని అనుకుంటున్నారు. .ఈ గేమ్ లో నిండా మునిగింది.. సర్వనాశనం అయింది ఉక్రెయినే.