అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలతో సవాల్ విసురుతున్న డొనాల్డ్ ట్రంప్..అమెరికాలో ఉండే ప్రవాసీయులకు గట్టి షాక్ ఇచ్చారు. అమెరికేతర పౌరులపై భారం మోపే నిర్ణయం తీసుకున్నారు. ప్రవాసీయులు తమ దేశాలకు నగదు బదిలీపై 5శాతం పన్ను విధించేలా ట్రంప్ తీసుకొచ్చిన బిల్లుకు ప్రతినిధుల సభలో తాజాగా ఆమోదం లభించింది.
ఈ బిల్లు ఇప్పుడు అమెరికా సెనేట్‌కు వెళుతుంది. అక్కడ దానిపై ఓటు జరుగుతుంది. అనంతరం సెనేట్ దానిని యథాతథంగా ఆమోదించవచ్చు లేదంటే సవరించవచ్చు. అయితే ఈ బిల్లు విషయంలో ట్రంప్ పట్టుదలగా ఉండటంతో ఈ బిల్లును సవరించే అవకాశం లేకపోవచ్చు.
ఈ చట్టం అమల్లోకి వస్తే భారత్ కు గట్టి షాక్ అనే చెప్పొచ్చు. అమెరికాకు విద్యాభ్యాసం, ఉద్యోగం కోసం ఇండియా నుంచి చాలామంది వెళ్తుంటారు. అక్కడ ఏదో ఒక బిజినెస్ లేదా పార్ట్ టైం ఉద్యోగమో చేస్తూ ఆ సంపాదనలో సగం ఇండియాలోని కుటుంబ సభ్యులకు పంపిస్తుంటారు. ఆ డబ్బులను వారు రియల్ ఎస్టేట్ లేదా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ , అలా పంపే డబ్బుపై ఇక నుంచి 5శాతం పన్ను పడనుండటంతో భారీ మొత్తంలో కోత పడనుంది.
విదేశీయులు సహా హెచ్-1బీ , గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే 1.6బిలియన్ డాలర్లు పన్ను రూపంలో ప్రవాసీ భారతీయుల నుంచి అమెరికా పొందనుంది.