అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ఇండియాలనూ ఆయన రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు. కోకాపేట్లో 63 అంతస్తులతో ట్రంప్ టవర్స్ ను నిర్మించనున్నారు. ఇది ఒక ఐకానిక్ లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. కోకాపేటలోని గోల్డెన్ మైల్లో రూ. 3,500 కోట్ల పెట్టుబడితో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ట్రంప్ భారతీయ రియల్టీ భాగస్వామి ట్రిబెకా డెవలపర్స్, స్థానిక రియల్టీ సంస్థ ఐరా రియల్టీల సంయుక్త సహకారంతో నిర్మిస్తున్నారు. మొత్తం 63 అంతస్తులతో రెండు ట్విన్ టవర్స్ నిర్మిస్తున్నారు.
4 ఎకరాల విస్తీర్ణంలో జంట టవర్లు నిర్మిస్తున్నారు. హై-ఎండ్ గ్లాస్, క్రోమ్ ఫినిష్‌తో డిజైన్ చేస్తున్నారు. మొత్తంగా రెండు టవర్స్‌లో కలిపి సుమారు 400 అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ యూనిట్లు ఉండే అవకాశం ఉంది. ఇతర ట్రంప్ టవర్లతో పోలిస్తే చిన్న ఫ్లాట్లనే నిర్మిస్తున్నారు. ఐదు వేల ఎస్ఎఫ్టీ లోపే ఉంటాయని అంటున్నారు. రెండు టవర్లను కలిపే వారధి ఉంటుంది. క్లబ్‌హౌస్, స్క్వాష్ కోర్ట్లు, ప్రీమియం సౌకర్యాలు ఉంటాయి.
చదరపు అడుగుకు సుమారు రూ. 15,000 వరకూ ఉండే అవకాశం ఉంది. ఒక్క యూనిట్ల ధర రూ. 4 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు ఉంటుంది. ఈ టవర్ల నిర్మాణం అన్ని అనుమతులు తీసుకుని 2025 ఆగస్టు-సెప్టెంబర్‌లో నిర్మాణం ప్రారంభం కానుంది. రెరా అనుమతి కూడా లభించింది. 2029-2030 నాటికి పూర్తవుతుంది. అయితే ట్రంప్ టవర్లు భారత్ కు కొత్తేం కాదు. భారతదేశంలో ఇప్పటికే నాలుగు ట్రంప్ టవర్లు ఉన్నాయి. ముంబై లో 78 అంతస్తులు , పూనే, కోల్‌కతా, గుర్గావ్ లో భారీ టవర్లు ఉన్నాయి. గత ఏడాది ట్రంప్ ఆర్గనైజేషన్ హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, పూనేలలో మరో ఆరు ప్రాజెక్ట్‌లను ప్రకటించింది. అందులో హైదరాబాద్ ప్రాజెక్ట్ వేగంగా పట్టాలెక్కుతోంది.