9న ఛ‌లో ట్యాంక్ బండ్… ఐక్య‌త‌ కాపాడుకోవ‌డ‌మే స‌వాలా?

మ‌రోవారం రోజుల‌పాటు నిర‌స‌న‌ కార్యాచ‌ర‌ణ‌ను ఆర్టీసీ జేయేసీ నేత‌లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు రాజ‌కీయ పార్టీల‌తో జేయేసీ నేత‌లు స‌మావేశ‌మై, దాదాపు మూడు గంట‌లపాటు చ‌ర్చించి షెడ్యూల్ వెల్ల‌డించారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర‌మంత్రుల‌ను, ట్రేడ్ యూనియ‌న్ నేత‌ల్ని క‌లిసి స‌మ్మెకు మ‌ద్ద‌తు కోరాల‌ని నిర్ణ‌యించారు. 4 లేదా 5వ తేదీన ఢిల్లీ వెళ్ల‌బోతున్నామ‌ని అశ్వ‌త్థామ‌రెడ్డి చెప్పారు. రేపు, అంటే 3న అన్ని డిపోల్లో స‌మావేశాలు జ‌రుగుతాయ‌నీ, 4న రాజ‌కీయ పార్టీల‌తోపాటు కుటుంబాల‌తో క‌లిసి డిపోల వ‌ద్ద ధ‌ర్నాలు, 5న స‌డ‌క్ బంద్, ఆ మ‌ర్నాడు 6న డిపోల ముందు ధ‌ర్నాలు, ఆ త‌రువాత‌.. 9న ఛ‌లో ట్యాంక్ బండ్ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తామ‌నీ, దీనికి రాజ‌కీయ పార్టీలు కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నాయంటూ జేయేసీ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించింది.

అయితే, ఈ స‌మావేశంలో కొంత ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం! ఇప్ప‌టికే ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకి దిగి రేప‌టికి 30 రోజులు అయిపోతుంది. దాదాపు రెండు నెల‌లుగా జీతాల్లేని ప‌రిస్థితి. పోనీ, ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టికైనా సానుకూల స్పంద‌న వ‌స్తుందా అనే ఆశ కూడా ఎక్క‌డా లేదు. దీంతో కొంత‌మంది ఆర్టీసీ నాయ‌కులు స‌మావేశంలో కాస్త నిరాశ‌గా మాట్లాడిన‌ట్టు స‌మాచారం. ఇంట్లో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నీ, నెల గ‌డిచిపోయింద‌నీ, ఇంకా ఉద్య‌మాన్ని కొన‌సాగించాలా అంటూ కార్మికులు అస‌హ‌నంగా ఉన్నారంటూ నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. రాజ‌కీయ పార్టీల నేత‌లు కేవ‌లం ప్ర‌సంగాల‌కే ప‌రిమితం అవుతున్నారే త‌ప్ప‌, పెద్ద ఎత్తున నిరస‌న‌ల‌కు రావ‌డం లేద‌ని కూడా కార్మిక నేత‌లు కొంద‌రు అన్నారు. దీంతో రాజ‌కీయ పార్టీల నేత‌లు జోక్యం చేసుకుని స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇవాళ్టి కేబినెట్ భేటీ, అనంత‌రం వెలువ‌డే నిర్ణ‌యాలు సానుకూలంగా ఉండాల‌నే కోరుకుందామ‌నీ, ఒక‌వేళ లేక‌పోతే కేంద్రం కూడా సాయం చేస్తుంద‌నీ, అధైర్య‌ప‌డొద్ద‌ని కోదండ‌రామ్, అశ్వ‌త్థామ‌రెడ్డి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కోర్టులో కూడా ప్ర‌భుత్వానికి సానుకూలంగా వాద‌న‌లు లేవ‌నీ, న్యాయం మ‌న ప‌క్క ఉంద‌నీ, కాబ‌ట్టి అధైర్య‌ప‌డ‌కుండా ఇంకొన్నాళ్లు పోరాటం సాగించాల‌ని నాయ‌కుల‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం.

కేబినెట్ నిర్ణ‌యం, ఆ త‌రువాత కోర్టు నిర్ణ‌యం.. ఈ నేప‌థ్యంలో ప‌రిస్థితి ఎప్పుడైనా ఎలాగైనా మారే అవ‌కాశం ఉంది. అయితే, ఈలోగా కార్మికుల ఐక్య‌త‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం నాయ‌కుల‌పై ఉన్న‌ట్టుగా ఈ స‌మావేశంలో వాతావ‌ర‌ణం క‌నిపించింది. నెల‌రోజులుగా జీతాలు లేక‌పోవ‌డం, ప్ర‌భుత్వం మొండిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం చూస్తుంటే… స‌గ‌టు ఆర్టీసీ ఉద్యోగికి కొంత భ‌య‌మూ, చేస్తున్న పోరాటంపై కొన్ని అనుమానాలు రావ‌డం స‌హ‌జ‌మే. చూడాలి.. అంతిమంగా ఇది ఎటువైపు వెళ్తుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com