టీటీడీ పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తన రాజీనామా ఆమోదిచాలని కోరారు. జంగా కృష్ణమూర్తి తిరుమలలో ఒక కాటేజీని నిర్మించాలనుకున్నారు. ఇటీవల ఆయన కాటేజీకి బోర్డు అనుమతి ఇచ్చింది. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యతిరేకత కథనం వచ్చింది. ఆయనకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని .. ఇలా కాటేజీకి అనుమతి ఇవ్వడాన్ని బీజేపీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వ్యతిరేకించారని చెప్పింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో కాటేజీ నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఈ వివాదం కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
జంగా కృష్ణమూర్తి 2005లో ఆయన తొలిసారిగా కాటేజీ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా, అప్పటి టీటీడీ బోర్డు బాలాజీ నగర్‌లోని ఒక ప్లాట్‌ను కేటాయించింది. అయితే, విరాళం మొత్తం పది లక్షల నుండి 50 లక్షలకు పెరగడం, ఆయన సకాలంలో ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో అప్పట్లో ఆ కేటాయింపు రద్దయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో కూడా ఆయన నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో మరోసారి అదే ప్లాట్‌ను ఆయనకు కేటాయించారు. అప్పట్లో కోటి రూపాయల విరాళం చెల్లించాలని టీటీడీ కోరగా, ఆయన కేవలం 10 లక్షలు మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తానికి గడువు కోరారు. ఆయన ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్టు పేరు మీద ఆ ప్లాట్ కేటాయించాలని ఆయన కోరారు. కానీ బోర్డు తిరస్కరించింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక, జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరి టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ఈ క్రమంలో, పాత విరాళం రేట్లకే అదే స్థలాన్ని ఆయన సూచించిన ట్రస్టుకు కేటాయిస్తూ బోర్డు ఇటీవల తీర్మానం చేసింది. అది వివాదాస్పదంఅయి ఉంది.
ఈ వివాదం ముదురుతుండటం, ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ భూమి కేటాయింపులు చేసే ఎస్టేట్ కమిటీ లో కూడా ఆయనే ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కిందకు వస్తుందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
