తిరుమలలో స్థలం కేటాయింపు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన అభ్యర్థనలను టీటీడీ తిరస్కరించింది. తిరుమల కొండపై సొంతంగా అతిథి గృహాలు నిర్మించడానికి గతంలో అనుమతులు ఇచ్చేవారు. భూమి కూడా కేటాయించేవారు. కాటేజీ నిర్మించినా అది టీటీడీకే ఇవ్వాల్సి ఉంటుంది. స్థలాలు లేకపోవడంతో కాటేజీలు నిర్మించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు.
తిరుమల కొండపై భౌగోళికంగా స్థలం చాలా పరిమితంగా ఉంది. కొత్త నిర్మాణాలకు చోటు లేకపోవడమే కాకుండా, ఉన్న స్థలాన్ని కేవలం సామాన్య భక్తుల వసతి కోసమే ఉపయోగించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, కొత్తగా ప్రైవేట్ లేదా వ్యక్తిగత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు. సాధారణంగా ఎవరైనా దాతలు ఇక్కడ భవనాలు నిర్మించాలనుకుంటే, వారు టీటీడీకి విరాళం ఇవ్వాలి. ఆ భవనాన్ని టీటీడీయే నిర్మిస్తుంది. దాతకు కేవలం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉండే హక్కు ఉంటుంది.
తిరుమలలో వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు భూములు ఇచ్చేలా ర రూల్స్ మార్చడం లేదు. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని సానుకూలంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు అందరికీ వర్తించాలి, నేనైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే అని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ప్రస్తుతం టీటీడీ పాతబడిన అతిథి గృహాలను కూల్చివేసి, వాటి స్థానంలో అత్యాధునిక వసతి సముదాయాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో వ్యక్తిగత దాతల పేర్లను కూడా తొలగించి, ఆధ్యాత్మిక పేర్లను పెడుతున్నారు. జిఎంఆర్ గెస్ట్ హౌస్‌ను ఆనంద నికేతనంగా మార్చారు.
