అమరావతి ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ “టీవీ5 మూర్తి”..!

రెండు నెలలుగా సాగుతున్న అమరావతి ఉద్యమంలో రాజకీయ నేతలెవరూ.. ప్రత్యేకంగా ముందుడి పోరాడుతూ.. తామే ఉద్యమానికి లీడర్ అని అనిపించుకోలేకపోయారు. దానికి వారికి రాజకీయ పరిమితులు ఉండొచ్చు. రైతుల ఉద్యమంపై రాజకీయ ముద్ర పడకూడదని భావించి ఉండవచ్చు. అందుకే రైతులే.. ఐక్యంగా తమ పోరాటాన్ని సాగిస్తున్నారు. అయితే.. వీరికి నైతికంగా మద్దతిస్తూ..మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ… సపోర్ట్ చేస్తూ.. ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తోంది మాత్రం.. జర్నలిస్టు టీవీ5 మూర్తి. ఆయన టీవీ డిబేట్లలో అమరావతిపై పెట్టే చర్చలు.. హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మూర్తి ..సహజంగానే విషయం ఉన్న జర్నలిస్టు. ఆయన తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబుతారు. ఎదురుదాడి చేయాలనుకున్నవారికి అదే తరహాలో సమాధానం చెబుతారు. ఇటీవలి కాలంలో ఆయన రాజధాని అంశాలపైనే ఎక్కువగా డిబేట్లు పెడుతున్నారు. చర్చలకు వచ్చే బీజేపీ నేతలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాష్ట్ర నాయకుల వాదనలు.. కేంద్ర నాయకుల వాదనలు.. గుర్తు చేసి.. ప్రజల్ని మోసం చేస్తున్నారని కుండబద్దలు కొడుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, మూర్తి మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. టీవీ5 చర్చలను వైసీపీ నేతలు ఎన్నికలకు ముందే బహిష్కరించారు. దాంతో.. వైసీపీ నేతలు పెద్దగా కనిపించరు. వారు కూడా వస్తే.. మూర్తి మరింత “టెంపర్‌”కు చూపించేవారమో..?

రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దన్న ఒకే ఒక స్టాండ్ మీద జర్నలిజం చేస్తున్న మూర్తి.. వారాంతాల్లో .. రైతులకు సంఘిభావం కూడా తెలుపుతున్నారు. రాజధాని గ్రామాలకు వెళ్తున్నారు. అక్కడి రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ పోరాటానికి మద్దతిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అన్నీ ఒక సైడ్ మాత్రమే కాదు.. మూర్తిని ట్రోల్ చేసేవాళ్లు కూడా సోషల్ మీడియాలో పెరిగిపోయారు. అమరావతిని వ్యతిరేకిస్తున్న పార్టీల సోషల్ మీడియా టీమ్స్ ఆయనపై దృష్టి పెట్టాయి. ఆయన టీవీ డిబేట్లో ఎక్కడైనా కొన్ని అతిశయోక్తుల్లాంటివి ఉంటే పట్టుకుని హైలెట్ చేస్తున్నారు. ఓ సందర్భంలో తాను రాష్ట్రం కోసం చానల్ మారానంటూ చేసిన వ్యాఖ్యలను ఇతర పార్టీలు.. హైలెట్ చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com