తెలుగు నాట పుట్టి దేశాన్ని రూల్ చేస్తున్నామని ధీమాగా ప్రకటించుకునే TV9 నెట్వర్క్లో మెజారిటీ వాటా అంటే దాదాపుగా 62 శాతం విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు కార్పొరేట్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా ఇలాంటి పెద్ద ఒప్పందాలు జరిగినప్పుడు, ఒక్కో సంస్థ ఒక్కో రకమైన అంచనాతో ఉంటుంది. ఆ అంచనాలు అంతర్గతంగానే ఉంటాయి. కానీ బయట మార్కెట్ వర్గాలు మాత్రం ఆ సంస్థ విలువ ఎంత ఉండవచ్చని శాస్త్రీయంగా విశ్లేషిస్తాయి. పబ్లిక్ డేటా, మార్కెట్ లెక్కల ప్రకారం TV9 విలువను మూడు ప్రధాన అంశాల ఆధారంగా మీడియా, టెలికాలం వాల్యూయేషన్ ఎనలిస్ట్ సురేంద్రనాథ్ విలువ అంచనా వేశారు.
ఆ మూడు
(1) ఐసీఆర్ఏ నివేదించిన ప్రకారం టీవీ9 నిర్వహణ ఆదాయం ,లాభదాయకత,
(2) 2018లో జరిగిన చివరి ప్రధాన ధర నిర్ధారణ లావాదేవీ
(3) స్టాక్ మార్కెట్లో నమోదైన ఇండియా టుడే గ్రూప్ లిస్టెడ్ కంపెనీ టీవీ టుడే నెట్వర్క్ బెంచ్మార్క్.
1. TV9 ఏడాదికి ఎంత సంపాదిస్తోంది?
ICRA నివేదికల ప్రకారం, TV9 మాతృసంస్థ ‘అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ (ABCPL) ఆర్థిక గణాంకాలు ఇలా ఉన్నాయి:
ఆదాయం : FY23లో రూ. 630.8 కోట్లు, FY24లో రూ. 707.0 కోట్లు, FY25లో రూ.749.0 కోట్లు. ఇది మొత్తంగా నిర్వహణ ఆదాయం. ఖర్చులు, పన్నులు అన్నీ పోగా.. లాభాల శాతం FY25లో 15.7% గా ఉంది. అంటే TV9 నెట్ వర్క్ ఏడాదికి రూ 700 నుంచి రూ. 750 కోట్ల ఆదాయం గడిస్తోంది. అందులో 15 శాతం వరకూ లాభంగా మిగుల్చుకుంటోంది.
2. గత ఒప్పందం ప్రకారం విలువ ఎంత? ఇది అత్యంత కీలకం.
ఒక కంపెనీ విలువను అంచనా వేయడానికి పాత లావాదేవీలు మంచి ప్రాతిపదిక. ఆగస్టు 2018లో TV9 యాజమాన్యం చేతులు మారినప్పుడు, మీడియా కథనాల ప్రకారం ఆ నెట్వర్క్ మొత్తం విలువను సుమారు రూ. 456 కోట్లుగా లెక్కగట్టారు.
3. స్టాక్ మార్కెట్ లెక్కల ప్రకారం ఎంత ఉండొచ్చు (TV Today బెంచ్మార్క్):
టీవీ9 నెట్ వర్క్ స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ కాలేదు. కానీ ఇదే విభాగంలో లిస్ట్ అయిన కంపెనీలను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ఇండియా టుడే గ్రూపునకు చెందిన ‘TV టుడే నెట్వర్క్’ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది.
-టీవీ టుడే నెట్ వర్క్ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 802 కోట్లు.
-FY25 ఆదాయం దాదాపు రూ. 993 కోట్లు.
-దాని ఎంటర్ప్రైజ్ వ్యాల్యూ (EV) సుమారు రూ.596 కోట్లుగా ఉంది.
అంటే, మార్కెట్ ఒక వార్తా సంస్థకు దాని ఆదాయం కంటే తక్కువ విలువనే ఇస్తోందని ఇక్కడ అర్థమవుతోంది.
*4. TV9 నెట్వర్క్ విలువ – ఒక అంచనా:
ICRA 2025 గణాంకాల ఆధారంగా ఆదాయం రూ.749 కోట్లు, లాభం రూ.118 కోట్లుగా టీవీ నైన్ నెట్ వర్క్ రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్థ విలువను రెండు పద్ధతుల్లో లెక్కించవచ్చు
ఆదాయం ఆధారంగా : ఆదాయానికి 0.9x నుండి 1.1x రెట్లు విలువ ఇస్తే.. టీవీ9 నెట్ వర్క్ విలువ రూ. 674 కోట్ల నుండి రూ. 824 కోట్ల మధ్య ఉంటుంది.
నిర్వహణ లాభం ఆధారంగా : లాభానికి 6 నుండి 7 రెట్లు విలువ ఇస్తే.. అది రూ. 706 కోట్ల నుండి రూ. 823 కోట్ల మధ్య ఉంటుంది.
ఈ రెండు పద్ధతులు కూడా దాదాపు ఒకే స్థాయిని సూచిస్తున్నాయి.
వాస్తవంగా ఎంత ఉండొచ్చు?
TV9 ప్రస్తుత ఆదాయం, లాభాలు, 2018 నాటి విలువ , మార్కెట్లో ఉన్న ఇతర సంస్థల విలువలను బట్టి చూస్తే.. TV9 నెట్వర్క్ మొత్తం విలువ సుమారు రూ.700 కోట్లుగా ఉండవచ్చనేది ఒక వాస్తవిక , సంప్రదాయబద్ధమైన అంచనా.
కాబట్టి, అందులో ఉన్న 60% వాటాను విక్రయిస్తే, ఆ వాటాదారులకు సుమారు రూ. 400 కోట్లు లభించే అవకాశం ఉంది.
గమనిక: ఇది బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చేసిన విశ్లేషణాత్మక అంచనా మాత్రమే. ప్రైవేట్ ఒప్పందాల్లో విలువలు మారవచ్చు .
