టీవీ9 .. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్రవేసిందని బ్రేకింగులు వేసింది. అదెలా సాధ్యమని చాలా మంది రాజకీయ నేతలు ఆలోచించే లోపు.. టీవీ9ని చూసి ఇతర చానళ్లు వేసేశాయి. మనమే ఆలస్యం అవుతామని అందరూ అందుకున్నారు. కానీ అసలేం జరిగిందో తెలుసుకున్న వారికి .. అసలు ఆ బిల్లును ఆమోదించినట్లుగా తెలియని రాజ్ భవన్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. అసలు అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ కు పంపిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టసవరణ బిల్లులపై గవర్నర్ ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. రాజ్ భవన్ పరిశీలనలోనే ఉన్నాయి.
అసలు జరిగిందేమిటంటే..ప్రభుత్వం కొన్ని మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. టీవీ9లో ఎవరో పేరు మోసిన జర్నలిస్టు.. తనదైన ఇంగ్లిష్ లో దాన్ని చదివి..ఇది అదే అనుకుని .. బిల్లుకు గవర్నర్ ఆమోదం అని బ్రేకింగులు వేయించారు. చివరికి నిజం తెలుసుకుని పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలు కూడా గవర్నర్ ఆమోదించడం అంటే.. అది అసాధారణ పరిణామమే అనుకున్నారు.
ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులో ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయి. అది రాజ్యాంగ విరుద్ధమన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే ఓ సారి ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి వద్ద ఉంది. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తారా తిరస్కరిస్తారా అన్నదానిపై స్పష్టతలేదు. ఈ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు కావడంతో విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బిల్లును గవర్నర్ ఆమోదించడం అసాధారణమే అవుతుంది. కానీ ఘనత వహించిన టీవీ9 మార్క్ జర్నలిజానికి నమ్మిన వాళ్లందరూ బకరాలు కావాల్సి వచ్చింది.