తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, టీవీకే చీఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనతో ఏ రాజకీయ మిత్రపక్షం లేదా పొత్తు లేకపోయినా, ఈ టీవీకే సైన్యం ఒంటరిగానే విజయం సాధిస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా తనను తక్కువ అంచనా వేసిన రాజకీయ శక్తులకు 2026 ఎన్నికలే సమాధానం చెబుతాయని హెచ్చరించారు. పార్టీ గుర్తుగా విజిల్ వచ్చిన సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తనపై ప్రజలకు ఉన్న నమ్మకమే తన బలం అని, ఏ రకమైన ఒత్తిళ్లకు తాను లొంగిపోయే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అధికార డీఎంకే, ప్రధాన విపక్షం ఏఐఏడీఎంకేలపై విజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏఐఏడీఎంకే ప్రత్యక్షంగా, డీఎంకే పరోక్షంగా బీజేపీకి తలవొంచాయని ఆయన ఆరోపించారు. నా ముఖం చూస్తే ఎవరికైనా లొంగిపోయేలా కనిపిస్తోందా? అని ప్రశ్నిస్తూ తన పట్టుదలను చాటుకున్నారు. కేవలం రాజకీయ అధికారం కోసమే పొత్తుల చుట్టూ తిరిగే పార్టీలకు భిన్నంగా, తాము సిద్ధాంతపరమైన పోరాటం చేస్తామని విజయ్ ప్రకటించారు.
తన 2019 చిత్రం బిగిల్ లోని పాపులర్ డైలాగ్ కప్పు ముఖ్యం బిగిలుని ప్రస్తావిస్తూ, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మహాబలిపురం వేదికగా జరిగిన ఈ సమావేశంలో విజయ్ తన పార్టీ ఎన్నికల గుర్తు విజిల్ ను అధికారికంగా ప్రదర్శించారు. వేదికపై స్వయంగా విజిల్ ఊదుతూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. తమ పార్టీలో ప్రతి కార్యకర్త ఒక ఫ్రంట్లైన్ వారియర్ అని, ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విజయ్ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఒంటరి పోటీనేననే సంకేతాలను ఈ ఆదివారం ఇచ్చారని అనుకోవచ్చు.
