ఎన్నికల్లో గెలవాలంటే చాలా కలసి రావాలి. ప్రజల మద్దతు అంతిమం అయినా.. వారిని ఓట్లు వేయించుకునే మెకానిజం ఉండాలి. ఆ మెకానిజంలో మొదటి ప్రాధాన్యత ఆర్థికత బలమే. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో విజయ్ ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. అది సామాన్యమైన విషయం కాదు. విజయ్ పట్ల యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ఎన్నికల రణక్షేత్రంలో అభ్యర్థుల ఎంపిక , వారి ఆర్థిక స్థితిగతులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విజయ్ పార్టీ లో మెజారిటీ అభ్యర్థులు కొత్తవారు, సామాన్య నేపథ్యం ఉన్నవారే అవుతారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజాలను ఎదుర్కోవడానికి కావాల్సిన ఎన్నికల నిధి విజయ్ దగ్గర ఉందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.
కార్పొరేట్ దూరం – సామాన్యుల భారం
సాధారణంగా కొత్తగా వచ్చే రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇవ్వడానికి వెనుకాడుతుంటాయి. ముఖ్యంగా అధికార పక్షం బలంగా ఉన్నప్పుడు, రిస్క్ తీసుకోవడానికి వ్యాపారవేత్తలు ఇష్టపడరు. మరోవైపు, విజయ్ అభ్యర్థులకు కనీసం ఒక్కో నియోజకవర్గానికి రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేసే స్తోమత ఉండాలని పార్టీ అంతర్గత చర్చల్లో అభిప్రాయపడినట్లు సమాచారం. కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలకు అంతటి ఆర్థిక వెన్నుముక లేదు. ఈ తరుణంలో క్రౌడ్ ఫండింగ్ లేదా విజయ్ సొంత నిధులే దిక్కు కావాల్సి ఉంటుంది.
డబ్బు ప్రవాహాన్ని దళపతి అడ్డుకోగలరా?
తమిళనాడు ఎన్నికలు అంటేనే దేశంలోనే అత్యంత ఖరీదైనవిగా పేరు. ఓటుకు నోటు పంపిణీలో అక్కడి ప్రధాన పార్టీలు కొత్త రికార్డులు సృష్టిస్తుంటాయి. మరి ఈ ధన ప్రవాహాన్ని విజయ్ కేవలం తన చరిష్మాతో అడ్డుకోగలరా అన్నది సందేహమే. సామాన్య అభ్యర్థులను నిలబెట్టి, వారిని గెలిపించుకోవాలంటే అద్భుతమే జరగాలి. ప్రత్యర్థులు బలమైన ఆర్థిక బలగంతో తలపడుతుంటే, అనుభవం లేని అభ్యర్థులు ఆ ఒత్తిడిని ఎంతవరకు తట్టుకోగలరు అన్నది సందేహమే.
అభ్యర్థుల్ని నిలబెట్టుకోవడం కూడా సవాల్
విజయ్ తమతో కలుస్తారని బీజేపీ అగ్రనాయకత్వం చివరి నిమిషం వరకు ఆశపడింది. అయితే, తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని భావిస్తున్న విజయ్, పొత్తుల వల్ల తన ఇమేజ్ దెబ్బతింటుందని భావించి ఒంటరిగానే వెళ్తున్నారు. కానీ, రాజకీయాల్లో కేవలం సిద్ధాంతాలు మాత్రమే గెలిపించవు, వ్యవస్థాగతమైన బలంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా కీలకమే. ఈ క్రమంలో విజయ్ అనుసరిస్తున్న క్లీన్ పాలిటిక్స్ వ్యూహం, తమిళనాడులోని మనీ పాలిటిక్స్ ముందు నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. విజయ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అభ్యర్థుల ఎంపికే కాదు, వారిని చివరి వరకు నిలబెట్టుకోవడం. బలమైన అభ్యర్థులు లేకపోవడం, ఆర్థిక అడ్డంకులు, రాజకీయ అనుభవం లేని టీమ్.. ఇవన్నీ విజయ్ ప్రయాణంలో గతుకులుగా మారే అవకాశం ఉంది. అయితే, ప్రజల్లో నిజమైన మార్పు కోరుకునే వారు నిధుల కంటే నేతపై నమ్మకంతో ఓటేస్తే, విజయ్ అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేయవచ్చు. కానీ, తమిళ రాజకీయాల చరిత్ర చూస్తే డబ్బు పాత్రను విస్మరించడం ఎవరికైనా కష్టమే. విజయ్ తీసుకున్న ఈ ఒంటరి పోరు నిర్ణయం ఒక గొప్ప సాహసం . ఈ సాహసం ఆయనను సింహాసనంపై కూర్చోబెడుతుందో లేక ఒక గుణపాఠంగా మిగిలిపోతుందో 2026 ఫలితాలే తేలుస్తాయి.


