తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్ సెన్సార్ వివాదం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడాన్ని నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఎదురవుతున్న ఈ న్యాయపరమైన అడ్డంకులు చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా రివైజ్డ్ కమిటీకి నివేదించడంతో నిర్మాత మొదట హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్, సినిమానుకు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ పోర్డును ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై సెన్సార్ బోర్డు అప్పీలు చేయడంతో, హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. సెన్సార్ బోర్డు వాదనలను పరిగణనలోకి తీసుకున్న డివిజన్ బెంచ్, తదుపరి విచారణ వరకు సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో తమకు భారీ నష్టం వాటిల్లుతుందని, సెన్సార్ బోర్డు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేను తొలగించి, సినిమా విడుదలకు మార్గం సుగమం చేయాలని తన పిటిషన్లో కోరింది. సుప్రీంకోర్టు స్పందనను బట్టి జననాయగన్ రిలీజ్ తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది.
