తమిళనాట రాజకీయం మారిపోయింది. వెండితెరపై తన డైలాగులతో థియేటర్లను హోరెత్తించే దళపతి విజయ్, రాజకీయ క్షేత్రంలో మాత్రం మౌనమే ముద్దు అన్నట్లు వ్యవహరిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఏనాడూ మీడియాతో నేరుగా ముచ్చటించలేదు, ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. కేవలం బహిరంగ సభల్లో సినిమాటిక్ శైలిలో ప్రసంగించడం తప్ప, సమకాలీన సమస్యలపై విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చేయడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కరూర్ సహా ఏ ఘటనపైనా స్పందించింది లేదు!
ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే, తన సినిమా విడుదల ఆగిపోయినప్పుడు కానీ, కరూర్ వంటి సున్నితమైన ఘటనలు జరిగినప్పుడు కానీ విజయ్ నోరు విప్పలేదు. కనీసం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో ఐదు రోజుల పాటు అనిశ్చితి నెలకొన్నా, ఆయన రాజ్‌భవన్ మెట్లు ఎక్కడం, దిగడం తప్ప ప్రజలకు నేరుగా వివరణ ఇచ్చింది లేదు. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం కమ్యూనికేషన్ . అయితే విజయ్ మాత్రం మీడియాను ఒక అంటరానిదిగా చూస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు.
విజయ్‌కు అసలేం తెలియదంటున్న ఇతర పార్టీల నేతలు
విజయ్‌కు రాష్ట్రానికి సంబంధించిన పాలనాపరమైన అంశాలపై, సంక్లిష్టమైన సమస్యలపై పూర్తిస్థాయిలో సబ్జెక్ట్ లేకపోవడమే ఈ మౌనానికి కారణమని ప్రచారం జరుగుతోంది. లైవ్ ఇంటర్వ్యూల్లో లేదా ప్రెస్ మీట్లలో లోతైన ప్రశ్నలు ఎదురైతే తడబడతారనే భయంతోనే ఆయన స్క్రిప్టెడ్ ప్రసంగాలకే పరిమితమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి వారు కూడా తొలినాళ్లలో తక్కువగా మాట్లాడినప్పటికీ, విజయ్ అనుసరిస్తున్న ఈ అతి మౌనం భవిష్యత్తులో పాలనాపరమైన సవాళ్లు ఎదురైనప్పుడు ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
వ్యూహాత్మక మౌనం .. ఎప్పుడూ కాదు!
వ్యూహాత్మక మౌనం అనేది కొంతవరకు ఆకర్షణను పెంచవచ్చు కానీ, బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నప్పుడు ప్రజల సందేహాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ దీన్ని స్ట్రాటజీ అని సమర్థించుకుంటున్నా, విపక్షాలు మాత్రం దీన్ని అజ్ఞానం గా అభివర్ణిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా విజయ్ ఇదే ధోరణిని కొనసాగిస్తే, మీడియా ప్రతినిధులతో నిరంతరం ముచ్చటించే ఎం.కె. స్టాలిన్ వంటి నేతలతో పోలిక వచ్చినప్పుడు విజయ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది.
