తమిళ హీరో విజయ్ .. రాజకీయాల్లోనూ హీరోయిజమే చూపించాలని డిసైడయ్యారు. దానికి తగ్గట్లుగా ఆయన చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మధురై జిల్లాలోని పరపతిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఓ ప్రకటన చేశారు. పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నానని చెప్పి..అన్నీ తన పేర్లనే ప్రకటించుకున్నారు. అంటే.. అన్ని చోట్లా తమిళనాడు అంతటా ఉన్న 234 నియోజకవర్గాలకు నేను అభ్యర్థిని. అలా ఆలోచించి, మీరందరూ ఓటు వేయాలని ప్రజలను కోరారు.
కొంత మంది నటుల మాదిరిగా మార్కెట్ పోయాక రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను అన్నింటికి సిద్ధంగా ఉన్నానని తాను ఎంత చేసినా ప్రజల కృతజ్ఞతా రుణం నేను తీర్చుకోలేనన్నారు. నా పని ప్రజల కోసం పనిచేయడమని చెప్పుకున్నారు. తన పార్టీ విజయం ఓ చారిత్రక నిర్ణయంగా విజయ్ చెప్పుకొచ్చారు. 1967లో డీఎంకే, 1977లో అన్నాడీఎంకేలతో ఎలా మార్పు వచ్చిందో 2026 అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీవీకే అలాంటి మార్పు తెస్తుందన్నారు.
ఈ సభలో విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని తేల్చారు. డీఎంకేను రాజకీయ శత్రువుగా.. బీజేపీని భావజాల శత్రువుగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ డీఎంకేతోనే ఉంటుందని.. పీఎంకే విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. స్టాలిన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని.. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్దూ ప్రజాదరణ కోల్పోయిందన్నారు. గతంలో నిర్వహించిన సభలో తననే సీఎం అభ్యర్థిగా విజయ్ ప్రకటించుకున్నారు. ఇప్పుడు అన్ని చోట్లా తానే అభ్యర్థిగా చూడాలని పిలుపునిచ్చారు. చూస్తూంటే.. వ్యక్తిపూజ రాజకీయాలు తమిళనాడుకు సరిపోతాయి కాబట్టి.. విజయ్ కూడా అదే ఇమేజ్ తో .. ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.