మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న విబేధాలను పక్కన పెట్టి ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే సోదరులు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం చేతులు కలిపారు. కానీ ఇప్పటికే శివసేన షిండే చేుతల్లోకి వెళ్లిపోయింది. వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం, ఓటు బ్యాంకును ఏకీకృతం చేసే దిశగా వేసిన బలమైన అడుగుగా భావిస్తున్నారు. శివసేనలో చీలిక వచ్చి అధికారం, పార్టీ పేరు , గుర్తు ఏకనాథ్ షిండే చేతుల్లోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో, థాకరే బ్రాండ్‌ను కాపాడుకోవడం ఉద్ధవ్‌కు అనివార్యంగా మారింది.
గత రెండు దశాబ్దాలుగా మరాఠీ ఓటర్లు శివసేన , ఎంఎన్ఎస్ మధ్య చీలిపోవడం వల్ల అంతిమంగా బీజేపీ, ఇతర కూటములు లాభపడుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు చేతులు కలపడం వల్ల ముంబైలోని మరాఠీ ప్రాబల్యం ఉన్న వార్డుల్లో ఓట్ల చీలిక ఆగుతుంది. సంఖ్యాపరంగా చూస్తే, వీరిద్దరి ఉమ్మడి ఓటు శాతం ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శివసేన వారసత్వంపై ఏకనాథ్ షిండే చేస్తున్న వాదనను తిప్పికొట్టడానికి, అసలైన థాకరే వారసులం మేమే అని ప్రజలకు చాటిచెప్పడానికి వీరు ప్రయత్నించనున్నారు.
ఈ కూటమికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. రాజ్ థాకరే ఎంఎన్ఎస్ కలసి పని చేయడానికి శరద్ పవార్, కాంగ్రెస్ సిద్ధంగా లేవు. కానీ ఆ పార్టీలతో కూటమిలో ఉద్దవ్ ఉన్నారు. అందుకే ఉద్దవ్ ధాక్రే కూటమితో తెగదెంపులు చేసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక అంశాలు, ప్రాంతీయ అస్తిత్వం ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి, థాకరే సోదరులు ఒకే వేదికపైకి రావడం కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి వీరే థాకరే వారసులని నిరూపించుకోగలుగుతారా లేదా అన్నది కీలక విషయం.