అమెరికా విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా స్టార్మర్ అత్యంత సన్నిహితుడైన పీటర్ మాండెల్సన్‌ను అమెరికా రాయబారిగా నియమించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. మాండెల్సన్కు గతంలో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సున్నితమైన సమాచారాన్ని ఆయనకు లీక్ చేశారని అమెరికా ఫైల్స్ వెల్లడించాయి. ఈ నియామకంపై స్టార్మర్ తీసుకున్న నిర్ణయం ఆయన విచక్షణను ప్రశ్నార్థకం చేసింది. ఇప్పటికే ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాజీనామా చేయడంతో స్టార్మర్ పదవికి గండం పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రధాని రేసులో షబానా మహమూద్
ప్రధాని స్టార్మర్ ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే, ఆయన స్థానంలో ప్రస్తుత హోం సెక్రటరీ షబానా మహమూద్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె బ్రిటన్ ప్రధాని పీఠం అధిష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 45 ఏళ్ల షబానా, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మూలాలున్న కుటుంబానికి చెందిన మహిళ. ఆక్స్ఫర్డ్ గ్రాడ్యుయేట్, వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె, 2010లో బ్రిటన్ చరిత్రలో తొలి ముస్లిం మహిళా ఎంపీలలో ఒకరిగా రికార్డు సృష్టించారు. స్టార్మర్‌కు అత్యంత నమ్మకస్థురాలిగా, సమర్థురాలైన వక్తగా ఆమెకు లేబర్ పార్టీలో మంచి పట్టు ఉంది.
వలసలపై కఠిన వైఖరి:
షబానా మహమూద్ ప్రధాని కావడానికి ఆమెకు ఉన్న అతిపెద్ద బలం.. వలసల విషయంలో ఆమె అనుసరిస్తున్న కఠిన వైఖరి. సాధారణంగా ముస్లిం నాయకులు వలసదారుల పట్ల సానుకూలంగా ఉంటారనే అభిప్రాయం ఉంటుంది, కానీ షబానా మాత్రం కఠినంగాఉంటారు. వలస నిబంధనలను కఠినతరం చేస్తూ ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు స్థానిక బ్రిటన్ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ హార్డ్ లైన్ ఇమేజ్ ఆమెను పార్టీలోని ఇతర నేతల కంటే ముందు వరుసలో నిలబెడుతోంది.
ముస్లిం ప్రధాని – ఒక చారిత్రక మార్పు
ఒకవేళ షబానా మహమూద్ ప్రధాని అయితే, క్రైస్తవ ప్రాధాన్యత ఉన్న బ్రిటన్ దేశానికి ఆమె మొట్టమొదటి ముస్లిం ప్రధానిగా చరిత్ర సృష్టిస్తారు. ఇది బ్రిటన్ రాజకీయాల్లో ఒక చారిత్రక పరిణామం మాత్రమే కాదు, గ్లోబల్ పాలిటిక్స్‌లోనూ పెద్ద మార్పుకు సంకేతం. గతంలో భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని కావడం ఒక ఎత్తైతే, ఇప్పుడు పాక్ మూలాలున్న ముస్లిం మహిళ ఆ పీఠంపై కూర్చోవడం మరింత ఆసక్తికరంగా మారుతుంది.
ఎన్ని అవకాశాలు ఉన్నాయి?
ప్రస్తుతానికి బెట్టింగ్ మార్కెట్ ఆమె ప్రధాని అయ్యే అవకాశాలను 10 శాతం గా అంచనా వేస్తున్నప్పటికీ, స్టార్మర్ చుట్టూ ముసురుతున్న సంక్షోభం ఆమెకు అనుకూలంగా మారేలా ఉంది. లేబర్ పార్టీలో కనీసం 81 మంది ఎంపీల మద్దతు ఉంటే ఆమె నాయకత్వ పోటీలో నిలబడవచ్చు. స్టార్మర్ తన పదవిని కాపాడుకోలేకపోతే, ఆ గ్యాప్‌ను భర్తీ చేయగల అత్యంత సమర్థురాలిగా షబానా మహమూద్ కనిపిస్తున్నారు.
