తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన కేసు… ఓటుకు నోటు! ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓ నాయకుడితో బేరం కుదుర్చుకుంటూ రేవంత్ రెడ్డి కెమెరా కళ్లకు చిక్కారు. ఆ తరువాత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఫోన్లో స్టీఫెన్సన్తో మాట్లాడుతూ దొరికిపోయినట్టు కొన్ని ఆడియో టేపులు కూడా బయటకు వచ్చి సంచలనమైన సంగతి తెలిసిందే. చంద్రబాబును ఎవ్వరూ కాపాడలేరని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన రోజులూ ఉన్నాయి! ఆ తరువాత, ఇద్దరు చంద్రులూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఓటుకు నోటు ప్రస్థావన హెడ్లైన్స్ నుంచి పక్కకు జరిగింది. అయితే, తాజాగా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ఏసీబీ ఎందుకు విచారించలేదంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఓటుకు నోటు కేసు తెరమీదికి వచ్చినట్టయింది. అయితే, ఈ కేసు విచారణపై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. దానిపై కూడా రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో నాలుగు వారాల్లోగా ఈ కేసు విచారణ జరగాలని హైకోర్టుకు ఆదేశాలు అందాయి.
ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసు విచారణలోకి రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు! విచారణలో భాగంగా తనను కూడా ప్రతివాదుల్లో ఒకరిగా చేర్చాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన పిటీషన్లో చంద్రబాబు నాయుడు పేరు చాలా సందర్భాల్లో వచ్చిందని పిటీషన్లో పేర్కొన్నారు. ఇంతవరకూ ఆయన్ని సాక్షిగా విచారించలేదనీ, నిందుతుడిగా కూడా చేర్చలేదన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానంగా చూడాలని కోరారు! కాబట్టి, ఈ కేసుకు సంబంధించి తన వాదనల్ని కూడా హైకోర్టు వినాలని కోరుతూ ఇంప్లీడ్ చేయాలని అభ్యర్థించారు!
ఉండవల్లి మాటలకు కౌంటర్స్ ఇవ్వడం కష్టమని నాయకులు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే, కంటెంట్ లేనిదే ఆయన మాట్లాడరు! ఇప్పుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయితే చంద్రబాబుకు కాస్త ఇబ్బంది తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే… వైకాపా ఎమ్మెల్యే వేసిన కేసులో ఉండవల్లి ఇంప్లీడ్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉండటం!