అమెరికాలో గతంలో చదువు అయిపోగానే ఏదో ఓ ఉద్యోగం వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నిరుద్యోగిత రేటు అనూహ్యంగా పెరుగుతోంది. చదువు అయిపోయిన అందరికీ ఉద్యోగాలు రావడంలేదు. డిగ్రీ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగిత గత పన్నెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు మే 2025లో 4.2 శాతంగా నమోదు అయింది. కొత్తగా విద్య పూర్తి చేసుకున్న వారిలో ఈ నిరుద్యోగిత ఆరు శాతం వరకూ ఉంది.
ఎక్కువ మంది వ్యక్తులు నిరుద్యోగ బీమా క్లెయిమ్‌లపై ఉంటున్నారు. జూన్ లో ఇనీషియల్ జాబ్‌లెస్ క్లెయిమ్స్ 245,000గా ఉన్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఫెడరల్ ఉద్యోగ కోతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా నిరుద్యోగిత పెరుగుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకోవాలనుకునేవారిలో 90 శాతం మంది అక్కడే ఉద్యోగాలు వెదుక్కుంటారు. వారికి మూడేళ్ల పాటు ఓపీటీ ఆప్షన్ ఉంటుంది. అలా చదువుల కోసం వెళ్తున్న వారిలోనూ చాలా మందికి ఉద్యోగాలు లభించడం లేదు.
ఏఐ వినియోగం పెరిగిపోతూండటం, అది అన్ని రంగాల్లో విస్తరిస్తూ ఉండటంతో ఉద్యోగ నియామకాలు తగ్గిపోతున్నాయి. అదే సమయంలో దిగ్గజ కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ట్రంప్ విధానాలతో అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను తెచ్చి పెడతాయని అంచనా వేస్తున్నారు. అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులు అత్యథిక మొత్తం ఖర్చుపెట్టుకుంటున్నారు. ఉద్యోగం రాకపోతే ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంటారు.