చెప్పి మరీ మెడల్ కొట్టడం… మనోళ్లకు అది సాధ్యం కాదంటారు. రియో ఒలింపిక్స్ లో ఇప్పటి వరకూ జరిగింది చూస్తే ఔను నిజమే అనిపిస్తుంది. అనూహ్యంగా సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించే వరకూ మనకు ఒక్క మెడల్ కూడా రాలేదు. అనూహ్య పతకాలే తప్ప, అంచనాల మేరకు రాణించే ధీరులైన అథ్లెట్లు మనకు లేరంటే బాధ కలుగుతుంది.
మైకేల్ ఫెల్ప్స్ ఏడెనిమిది పతకాలతో తిరిగి వస్తాడని అమెరికన్లు పూర్తి విశ్వాసంతో ఎదురు చూస్తారు. అతడు అది సాధించి చూపిస్తాడు. గంపెడు పతకాలతో స్వదేశానికి తిరిగి వెళ్తాడు. ఉసేన్ బోల్ట్ కు మూడు మెడల్స్ గ్యారంటీ అని జమైకా ప్రజలు ఘంటాపథంగా చెప్పుకుంటారు. అతడు అంతకు తక్కువ కాకుండా మెడల్స్ ను మెడలో వేసుకుని జమైకాలో ల్యాండ్ అవుతాడు.
భారత్ విషయంలో మాత్రం పూర్తి రివర్స్. ఎవరో పతకం గెలుస్తారనుకుంటే ఇంకెవరో నెగ్గుతారు. స్టార్ స్పోర్ట్స్ పర్సన్న్ నిరాశ పరచడం మనకు ఆనవాయితీగా మారింది. ఏడుసార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్న లియాండర్ పేస్ 1996 అట్లాంటాలో టెన్నిస్ లో కాంస్య పతకం సాధించాడు. అప్పట్లో అతడు స్టార్ ప్లేయర్ కాదు. ఆ తర్వాత సిడ్నీ ఒలింపిక్స్ లో ఎవరెవరి మీదో అంచనాలుండేవి. అవన్నీ విఫలమయ్యాయి. అనూహ్యంగా కరణం మల్లీశ్వరి కాంస్య పతకంతో భారత్ పరువు నిలిపింది. అప్పటి వరకూ ఆమె ఎవరో చాలా మందికి తెలియదు.
2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో గురిచూసి రజత పతకాన్ని కొట్టిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పై అంచనాలేమీ లేవు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన అభినవ్ బింద్రా ఎవరో అప్పటి వరకూ ఎవరికీ తెలియదు. ఆనాడు కాంస్య పతకాలు గెల్చిన విజేందర్ సింగ్, సుశీల్ కుమార్ లపైనా అప్పట్లో అంచనాలేవీ లేవు.
2012 లండన్ ఒలింపిక్స్ లో గోల్డెన్ బాయ్ బింద్రాపై దేశం గంపెడాశలుపెట్టుకుంది. కానీ నిరాశ పరిచాడు. కొంత వరకు అంచనాలను అందుకున్న వారు సుశీల్ కుమార్, సైనా నెహ్వాల్ మాత్రమే. సానియా మీర్జా కూడా నిరాశ పరిచింది. మేరీ కోమ్ పైనా ఆమెకు స్వర్ణ పతకం ఖాయమనుకున్నారు. అయినా, అంచనాలను వమ్ము చేయకుండా కాంస్య పతకం సాధించింది.
రియో ఒలింపిక్స్ , కొందరిపై భారీ అంచనాలతో మొదలైంది. అభినవ్ బింద్రా, సానియా మిర్జా, ఆ తర్వాత దీపా కర్మాకర్ లపై భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నిరాశే మిగిలింది. చివరకు సాక్షి మాలిక్ రూపంలో తొలి పతకం దక్కింది. ఇప్పుడు పీవీ సింధుపై భారీగా అంచనాలున్నాయి. ఆమె కచ్చితంగా పతకాన్ని గెలుస్తుందని ఆశిద్దాం.