కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2026-27 బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు మొదలయ్యాయి. గత బడ్జెట్లోనే కొత్త పన్ను విధానంలో భారీ ఉపశమనం కలిగించిన నేపథ్యంలో, ఈసారి మినహాయింపుల విషయంలో ప్రభుత్వం వేచి చూసే ధోరణి అవలంబించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, మధ్యతరగతి వర్గాల నుంచి సెక్షన్ 80C పరిమితిని పెంచాలని, సెక్షన్ 87A కింద లభించే పన్ను రహిత ఆదాయ పరిమితిని రూ. 12 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంచాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎత్తేస్తారా?
కేంద్ర బడ్జెట్ అనగానే సగటు వేతన జీవి ఆశలన్నీ ఆదాయపు పన్ను స్లాబులపైనే ఉంటాయి. గత ఏడాది కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తూ, స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 75 వేలకు పెంచడం వల్ల ఇప్పటికే రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఊరట లభించింది. ఈసారి స్లాబుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఒక వాదన వినిపిస్తుండగా.. పాత పన్ను విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టి, ప్రజలందరినీ కొత్త విధానం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం మరిన్ని తాయిలాలు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. లక్షకు పెంచాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పెట్టుబడులకు ప్రోత్సాహం.. మినహాయింపుల ఆశలు
పాత పన్ను విధానంలో కొనసాగుతున్న వారు సెక్షన్ 80C కింద ఉన్న రూ. 1.5 లక్షల మినహాయింపు పరిమితిని రూ. 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగినందున పొదుపును ప్రోత్సహించేందుకు ఇది అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, ఈక్విటీ పెట్టుబడులపై లాభాల విషయంలో కూడా మార్కెట్ వర్గాలు కొన్ని మార్పులను ఆశిస్తున్నాయి. ప్రస్తుతం రూ. 1.25 లక్షల వరకు ఉన్న మినహాయింపును రూ. 2 లక్షల వరకు పెంచే ఆలోచన ప్రభుత్వం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
సిన్ టాక్స్ సెగ – సిగరెట్లు, పొగాకుపై పన్నుల బాదుడు
ప్రతి బడ్జెట్లోనూ ఎప్పటిలాగే సిన్ టాక్స్ ప్రభావం పొగాకు ఉత్పత్తులపై గట్టిగా పడనుంది. ఇప్పటికే ప్రభుత్వం జనవరి 1న విడుదల చేసిన గెజిట్ ప్రకారం, సిగరెట్ల పొడవు , ఫిల్టర్ ఆధారంగా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది. ఫిబ్రవరి 1 నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. 1,000 సిగరెట్ స్టిక్స్‌పై రూ. 2,050 నుండి రూ. 8,500 వరకు పన్ను విధించడంతో ధూమపానం మరింత భారంగా మారనుంది. పొగాకు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రభుత్వం ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ , గ్రీన్ ఎనర్జీ రంగాలకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కస్టమ్స్ డ్యూటీలో మార్పులు ఉండవచ్చు. పట్టణ మౌలిక సదుపాయాల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి కొత్త పథకాల ద్వారా నగరాల రూపురేఖలు మార్చాలని కేంద్రం భావిస్తోంది. మొత్తానికి, భారీ సంస్కరణల కంటే స్థిరత్వం , మధ్యతరగతికి స్వల్ప ఊరటనిచ్చే దిశగానే నిర్మలమ్మ అడుగులు పడేలా కనిపిస్తున్నాయి.
