మోసాల్లో రియల్ ఎస్టేట్ మోసాలు ప్రత్యేకమైనవి. మామూలు బిల్డర్లు చేసేవే కోట్లలో ఉంటాయి. అలాంటిది ఓ రేంజ్ బిల్డర్లు చేసే మోసం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో అతి పెద్ద మోసాల్లో మొదటిది యూనిటెక్ గ్రూప్ స్కామ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం, కంపెనీ ప్రమోటర్లు సంజయ్ చంద్రా, అజయ్ చంద్రా కొనుగోలుదారులు, ఆర్థిక సంస్థల నుంచి రూ. 16,000 కోట్లు సేకరించి రూ. 7,794 కోట్లను వ్యక్తిగత ఉపయోగాలకు మళ్లించారు. ఈ ఫండ్స్ బీనామీ కంపెనీలు, విదేశీ ఆస్తులు, మనీ లాండరింగ్ కార్యకలాపాలకు వాడారు.
యూనిటెక్ గ్రూప్, ఒకప్పుడు భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటిగా ఉండేది. 2008లో ఢిల్లీ-NCR ముఖ్యంగా గుర్గావ్ , చెన్నై , ముంబైలో భారీ స్థాయిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభించింది. ఇవి హై-ఎండ్ అపార్ట్మెంట్లు , విల్లాలుగా ప్రచారం చేశారు. కొనుగోలుదారులు. అడ్వాన్స్‌లుగా కోట్లాది రూపాయలు చెల్లించారు, కానీ ప్రాజెక్టులు సరిగా పూర్తి కాలేదు. దీనికి కారణం ఫండ్స్‌ను ప్రమోటర్లు వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేయడానికి, విదేశాలకు మళ్లించడానికి ఉపయోగించారు. సైప్రస్ , కేమన్ ఐలాండ్స్కు ₹2,000 కోట్లకు పైగా అక్రమంగా బదిలీ చేశారని గుర్తించారు.
ఈ మోసం వల్ల 29,000కు పైగా ఇళ్లకొనుగోలుదారులు నష్టపోయారు. చాలా మంది తమ జీవితకాల సేవింగ్స్‌ను పెట్టుబడి పెట్టి, ఇళ్లు లేకుండా మిగిలారు. ఈ మోసం ఫలితంగానే 2016లో RERA రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ ను ప్రభుత్వాలు తీసుకు వచ్చాయి. సుప్రీం కోర్టు ఈ కేసులో కీలక పాత్ర పోషించింది. 2020లో కంపెనీ మేనేజ్మెంట్ను ప్రభుత్వ నియమిత బోర్డుకు అప్పగించి, ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ స్కామ్ రియల్ ఎస్టేట్ రంగంలో రెగ్యులేషన్లను మరింత కఠినతరం చేసింది.