దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా నివేదిక ప్రకారం, 2025 చివరి నాటికి దేశంలోని టాప్-7 నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 4 శాతం పెరిగింది. సుమారు 5.77 లక్షల యూనిట్లు కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్నాయి. 2024 చివరి నాటికి ఈ సంఖ్య 5.53 లక్షలుగా ఉండేది. ఇళ్ల విక్రయాలు మందగించడం, అదే సమయంలో కొత్త ప్రాజెక్టులు మార్కెట్లోకి రావడం వల్ల ఈ నిల్వలు పేరుకుపోయినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
2025 సంవత్సరంలో ఇళ్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 14 శాతం మేర క్షీణించాయి. 2024లో 4.59 లక్షల ఇళ్లు అమ్ముడుపోగా, 2025లో ఆ సంఖ్య 3.95 లక్షలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకడం , ఐటీ రంగంలో చోటుచేసుకున్న లే-ఆఫ్స్ అని తెలుస్తోంది. అయితే, విక్రయాలు తగ్గినప్పటికీ డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను ఆపలేదు. గత ఏడాది కాలంలో కొత్త ఇళ్ల సరఫరా 2 శాతం పెరిగి 4.19 లక్షల యూనిట్లకు చేరింది. ఫలితంగా మార్కెట్లో డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా మారి, ఇళ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి.
అమ్ముడుపోని ఇళ్లు అత్యధికంగా బెంగళూరులో 23 శాతం, చెన్నైలో 18 శాతం ఉన్నాయి. ముంబై , హైదరాబాద్ నగరాలు కొంత మెరుగైన ఫలితాలను చూపాయి. హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టుల లాంచ్ కొంత తగ్గడం వల్ల అమ్ముడుపోని ఇళ్ల సంఖ్యలో 2 శాతం స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు 96,140 ఇళ్లు అమ్ముడుపోవాల్సి ఉంది. ఈ ఇన్వెంటరీ పెరుగుదల డెవలపర్లపై ఆర్థిక భారంగా మారనుంది. భారీ పెట్టుబడులు పెట్టిన ఇళ్లు అమ్ముడుపోకపోవడం వల్ల వారి వద్ద నగదు లభ్యత తగ్గి, ప్రాజెక్టుల పూర్తి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
