ఉప్పెన రివ్యూ : బయాలజీ పాఠం‌

తెలుగు360 రేటింగ్ 3/5

ఈమ‌ధ్య కాలంలో అటు బాక్సాఫీసునీ, ఇటు చిత్ర‌సీమ‌నీ, మొత్తంగా ప్రేక్ష‌కుల్నీ త‌న వైపుకు తిప్పుకున్న సినిమా `ఉప్పెన‌`నేమో..?

సుకుమార్ శిష్యుడి సినిమా..
అంద‌మైన హీరోయిన్‌..
అదిరిపోయిన పాట‌లు
మెగా హీరో నుంచి మ‌రో హీరో..
తిరుగులేని స్టార్ విల‌న్‌
క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హోస్‌.. ఇలా ఏ రూపంలో చూసినా విప‌రీత‌మైన బ్యాగేజీ మోసుకొచ్చిన సినిమా ఇది. ఓ ర‌కంగా చెప్పాలంటే స్టార్ హీరో సినిమాపై ఉండాల్సినంత ఫోక‌స్ ఈ సినిమా లాక్కుంది. మ‌రి.. అంత మైలేజీ `ఉప్పెన‌`లో ఉందా? ఈ ప్ర‌చారం సినిమాకి ప్ల‌స్ అయ్యిందా, మైన‌స్ అయ్యిందా?

శేషా రాయనం (విజ‌య్ సేతుప‌తి) ప‌రువు కోసం ప్రాణం ఇచ్చే మ‌నిషి. ఊరికి పెద్ద దిక్కు. కూతురు సంగీత (కృతి శెట్టి)ని త‌న ప‌రువుకి ప్ర‌తినిధిలా పెంచుకుంటూ ఉంటాడు. ఆ ఊర్లో ఆశి (వైష్ణ‌వ్ తేజ్) ఓ జాల‌రి కొడుకు. బ‌స్సులో కాలేజీకి వెళ్లే సంగీత‌ని చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. ఆశిలోని మ‌గ‌తనాన్ని, ధైర్యాన్ని, ద‌మ్ముని చూసి… సంగీత కూడా ఆశిని ఇష్ట‌ప‌డుతుంది. ఈ ప్రేమ సంగ‌తి… రాయ‌నంకి తెలుస్తుంది. ప‌రువే ప్రాణంగా బ‌తికే.. రాయ‌నం ఏం చేశాడు? ఈ ప్రేమ జంట ఎన్ని క‌ష్టాలు అనుభ‌వించింది? అనేదే క‌థ‌.

ఉప్పెన‌ అతి సాధార‌ణ‌మైన క‌థే అనే విష‌యం.. ఈ నాలుగు లైన్లు చ‌దివితే అర్థ‌మైపోతుంది. చిత్ర‌బృందం కూడా.. త‌మ క‌థేంటో.. ట్రైల‌ర్ లోనే చెప్పేసింది. అదే.. ప్రిపేర్ అయిపోయి ప్రేక్ష‌కుడూ థియేట‌ర్లోకి అడుగుపెడ‌తాడు. అందుకే.. క‌థ విష‌యంలో ప్రేక్ష‌కుడు అద్భుతాలేం ఊహించ‌లేదు. పాట‌లు ఆల్రెడీ బ‌య‌ట పెద్ద హిట్టు. థియేట‌ర్లో ఆ పాట‌లు అదిరిపోతే, హీరోయిన్ – హీరో కెమిస్ట్రీ కుదిరిపోతే, విల‌నిజం పండిపోతే.. – స‌రిపోతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి ఉంటారు. పైగా `ఆయువు ప‌ట్టు`లాంటి క్లైమాక్స్ ఉండ‌నే ఉంది. ఈ క్లైమాక్స్ గురించి త‌ర‌వాత మాట్లాడుకుందాం.. ముందు టేకాఫ్ గురించి చెప్పుకోవాలి.

ప్రేమ‌లో ఎప్పుడూ సంఘ‌ర్ష‌ణ ఉంటుంది. ప్రేమ‌కు అడ్డుగోడ‌లుంటాయి. ప్రేమ‌కి ప‌రీక్ష‌లు ఎదుర‌వుతాయి. బేబ‌మ్మ‌-ఆశి ప్రేమ‌క‌థ‌లోనూ అలాంటి సంఘ‌ర్ష‌ణ‌లు, అడ్డుగోడ‌లు, ప‌రీక్ష‌లు ఎదుర‌వుతూనే ఉంటాయి. అయితే.. ఈ మూడింటికి మూలం ఒక్క‌టే అదే.. ప‌రువు. ప‌రువు అనే పాయింట్ ప‌ట్టుకుని – సాగే క‌థ‌లు ఈమ‌ధ్య కాలంలో చాలా చూశాం. వాటిలో.. ఉప్పెన ఒక‌టి. టేకాఫ్ చాలా స్మూత్ గా.. సాఫీగా మొద‌ల‌వుతుంది. గొప్పింటి అమ్మాయి – పేదింటి అబ్బాయి మ‌ధ్య ప్రేమ కథ‌. మ‌ధ్య‌లో రాయ‌నం విల‌నిజం. అమ్మాయిలోని అమాయ‌క‌త్వం, అబ్బాయిలోని గ‌డుసుద‌నం.. ఇలా యూత్ కి కావ‌ల్సిన‌, వాళ్లు కోరుకున్న స‌న్నివేశాల‌తో… జ‌ర్కులు లేకుండా ఉప్పెన మొద‌లైంది. దేవిశ్రీ అండ‌తో… చాలా స‌న్నివేశాల్ని… బుచ్చి పాస్ చేయించుకున్నాడు. మ‌ధ్య‌లో పాట‌లు.. ఉప్పెన‌ని ఓ స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెడుతుంటాయి. కానీ.. సుకుమార్ శిష్యుడి నుంచి ఇంత‌కు మించి ఆశిస్తాం.

ఓ సీన్ లో.. చ‌క్క‌ర ఎక్కువైన టీ తాగుతున్న‌ప్పుడు విజ‌య్ సేతుప‌తి ఓ ఫిలాస‌ఫీ చెబుతాడు. ఆ సీన్ చూస్తే… బుచ్చిబాబులో విష‌యం ఉంద‌న్న సంగ‌తి అర్థ‌మైపోతుంది. విజ‌య్ సేతుప‌తి కోసం రాసుకున్న సంభాష‌ణ‌ల్లో … బుచ్చి ప‌నిత‌నం క‌నిపిస్తుంటుంది. అయితే… త‌న ఫోక‌స్ ఎప్పుడూ విజ‌య్ సేతుప‌తి చుట్టూనే తిరిగింది. ఆశి – బేబ‌మ్మ మ‌ధ్య ప్రేమ‌లో ఇంకేదో మ్యాజిక్‌ని ప్రేక్ష‌కుడు ఆశిస్తాడు. రొటీన్ ప‌ర‌వు క‌థ‌ని.. బుచ్చి త‌న‌దైన స్టైల్ లో చూపిస్తాడ‌ని అనుకుంటారు. కానీ.. ఆ రెండింటిలోనూ నిరాశ ఎదుర‌వుతుంది. ద్వితీయార్థంలో.. బుచ్చిబాబు క‌థ‌ని వ‌దిలి, స‌ముద్రాన్ని వ‌దిలి.. విహంగ వీక్ష‌ణం చేశాడేమో అనిపిస్తుంది. ద‌గ్గ‌ర‌య్యాక – దూరం పెంచుకునే ప్రేమికుల్నిచూపించి.. తేజ సినిమాల్ని గుర్తు చేశాడు. హీరోయిన్‌ని ప‌ట్టుకుని దేశ‌మంతా తిరిగే హీరో – హాస్ట‌ర్ డ‌బ్బుల కోసం ప‌గ‌లూ రాత్రీ తేడా లేకుండా క‌ష్ట‌ప‌డ‌డం – స‌ద‌రు స‌న్నివేశాల్ని ఇంకా ఎఫెక్టీవ్ గా రాసుకోవాల్సింది. పైగా.. అప్ప‌టికే… ఈ ఆల్బ‌మ్ లోని సూప‌ర్ హిట్ గీతాలన్నీ వాడేసుకోవ‌డం వ‌ల్ల‌, కొత్త‌గా పాట‌ల‌కు స్కోప్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌…. ద్వితీయార్థం చాలా ఫ్లాట్ గా సాగిపోతుంది.

స్క్రీన్ ప్లే మ్యాజిక్కుల్ని సైతం… ద‌ర్శ‌కుడు విస్మ‌రించాడు. ఆశి గ్రూప్ ఫొటో దిగిన‌ప్పుడే.. ఈ ఫొటోకీ, ఆ త‌ర‌వాతి స‌న్నివేశానికీ లింకు ఉంటుంద‌న్న విష‌యాన్ని ప్రేక్ష‌కుడు గ్ర‌హిస్తాడు. హీరోయిన్ ని హీరో శారీర‌కంగా దూరం పెడుతున్న‌ప్పుడే.. వెనుక క‌థేదో ఉంద‌న్న సంగ‌తి అర్థం అవుతుంటుంది. తీరా వాటిని ఓపెన్ చేసిన‌ప్పుడు `మాకిది ముందే తెలుసులేవోయ్‌` అంటూ ప్రేక్ష‌కుడు లైట్ తీసుకుంటాడు. దాంతో.. ఆయా స‌న్నివేశాలన్నీ తేలిపోయిన‌ట్టు ఉంటాయి.

ఈ సినిమా క్లైమాక్స్ గురించి ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. `ఈ సినిమాలో మ‌నం ఊహించ‌ని క్లైమాక్స్ చూడ‌బోతున్నాం` అని ఆడియ‌న్ కూడా ఫిక్స‌యిపోయాడు. కాబ‌ట్టి.. స‌ద‌రు స‌న్నివేశం పెద్ద‌గా షాక్ కి గురి చేయ‌దు. కాక‌పోతే… తండ్రి ముందు కూతురు చెప్పిక ఎమోష‌న‌ల్ డైలాగ్స్‌, మగతనం అంటే.. రెండు కాళ్ల మ‌ధ్య ఉండేది కాదంటూ… చెప్పే మాట‌లూ – ఈ సినిమాని మ‌ళ్లీ లైన్ లోకి తీసుకొస్తాయి. ఆ సీన్ లో కృతి… న‌టిగా మార్కులు కొట్టేస్తుంది. కాక‌పోతే.. అరివీర భ‌యంక‌రుడైన విల‌న్ ఆ మాట‌ల‌కే ఎలా బోల్తా కొట్టేశాడ‌న్న‌ది పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్‌. ఆ పాయింట్ ప‌క్క‌న పెడితే.. అంత‌టి స్టార్ విల‌న్ కి క్లైమాక్స్ లో ఒక్క మాట కూడా మాట్లాడ‌నివ్వ‌క‌పోవ‌డం – ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. `ఇంట్లో అమ్మ‌.. ఏ ప‌నికీ చేత కాకుండా. మంచంపైనే ఉంది క‌దా.. అయినా త‌న‌పై నీకు ప్రేమ పోలేదు. నాకూ అంతే.. `అని ఆ కోణంలో.. స‌ర్దిచెబితే.. అప్పుడు నాన్న‌లో మార్పు వ‌చ్చుంటే మ‌రింత బాగుండేది. మొత్తానికి క్లైమాక్స్‌లో ఉప్పెన‌లాంటి స‌న్నివేశం ఏదో చూస్తాం అనుకుని ఆశించిన ప్రేక్ష‌కుడికి కాస్త అసంతృప్తి, ఇంకాస్త అస‌హ‌నం క‌లిగితే.. అది క‌చ్చితంగా ఈ సినిమాకి ద‌ర్శ‌క నిర్మాత‌లు చేసిన ప్ర‌మోష‌న్ త‌ప్పిద‌మే.

వైష్ణ‌వ్ తేజ్‌కి ఇదే తొలి సినిమా. హీరోయిజం కోసం పాకులాడ‌కుండా.. క‌థ‌కు, త‌న పాత్ర‌కు ఏం కావాలో అదే చేశాడు. ఓ స‌గ‌టు కుర్రాడిగా ఇమిడిపోయాడు. అలాంటి క్లైమాక్స్ చెప్పిన‌ప్పుడు.. ఒప్పుకోవాలంటే హీరోకి గట్స్ ఉండాలి. ఈ విష‌యంలో తొలి సినిమా హీరోని మెచ్చుకోవాల్సిందే. కృతిపై అంద‌రి క‌ళ్లూ ప‌డ్డాయి. ఈసినిమాతో తాను స్టార్ హీరోయిన్ అయిపోతుంద‌ని అంతా ఆశించారు. కృతి కూడా అంద‌రి అంచ‌నాలకు త‌గ్గ‌ట్టే అల‌రించింది. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కొన్ని చోట్ల మాత్రం ఎందుకో తేలిపోయింది. క్లైమాక్స్ లో విజ‌య్ సేతుప‌తిని ఓ వైపు నిల‌బెట్టి దంచేసింది. విజ‌య్ సేతుప‌తి ఈ క‌థ‌కు ప్ర‌ధాన ఎస్సెట్ . అయితే త‌న‌ని స్క్రీన్ పైచూస్తున్న‌ప్పుడు ఇద్ద‌రు న‌టుల్నిచూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఒక‌రు.. విజ‌య్ సేతుప‌తి అయితే, ఇంకొక‌రు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌. ఆ గొంతు విజ‌య్ ని అన్ని వైపుల నుంచీ డామినేట్ చేసేసింది.

సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం… సూప‌ర్బ్ అంతే. ఈ విష‌యంలో ఇంకో మాట‌కు తిరుగులేదు. దేవి త‌న పాట‌ల‌తో ఈ క‌థ‌కు ప్రాణం పోశాడు. ఆ మాట‌కొస్తే.. ఈ సినిమాకి సిస‌లైన హీరో దేవినే. నేప‌థ్య సంగీతంలోనూ.. ఆ మూడ్ ని తీసుకొచ్చాడు. స‌ముద్రం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు, పాట‌ల్లో కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ ప‌రంగా.. మైత్రీ త‌న స్థాయిని చూపించింది. ద‌ర్శ‌కుడిలో విష‌యం ఉంది. కాక‌పోతే… చాలా సాధార‌ణ‌మైన క‌థ‌ని రాసుకున్నాడు. త‌న బ‌లం క్లైమాక్స్ అని తెలుసు. కానీ ఆ క్లైమాక్స్ ఎంత వ‌ర‌కూ.. సగ‌టు ప్రేక్ష‌కుడికి ఎక్కుతుంది? అనేది ప్ర‌శ్నార్థ‌కం.

ఉప్పెన అంటే… సముద్రంలో అల్ల‌క‌ల్లోలం! ఓ బీభ‌త్సం. ఓ భ‌యం. ఓ జ‌ల‌ద‌రింపు. అయితే… అంత ఉధృతాలేం.. ఈ క‌థ‌లో, క‌థ‌నంలో క‌నిపించ‌వు. ఓ రాజు – పేద ప్రేమ‌క‌థ‌కు… ఇది వ‌ర‌కు చూడ‌ని, చూపించ‌డానికి సాహ‌సించ‌ని క్లైమాక్స్ జోడించి.. దానికి `ఉప్పెన‌` అని పేరు పెట్టుకున్నారంతే. టెక్నిక‌ల్ వాల్యూస్‌, కృతి శెట్టి… ఇవే – ఉప్పెన‌ని కాపాడే అంశాలు. ఈ మధ్య పరిపూర్ణ ప్రేమ కథా చిత్రాలు రాలేదు కాబట్టి… కుర్ర కారు మళ్లీ థియేటర్ బాట పట్టొచ్చు

తెలుగు360 రేటింగ్ 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close