కీర్తి సురేశ్ నేరుగా ఓటీటీ సినిమాలు చేస్తోంది. ఓటీటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేకమైన కథల్ని ఓకే చేస్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఉప్పు కప్పురంబు’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. సుహాస్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి, బాబు మోహన్ లాంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కనిపించడం కొంత ఆసక్తిని పెంచింది. శ్మశానంలో భూమి కొరత నేపథ్యంలో సాగే కథని ట్రైలర్లో చూపించడం… ఐడియా ఏదో కొత్తగా వుందనే ఫీలింగ్ కలిగించింది. మరీ కొత్త పాయింట్ మెప్పించిందా? కీర్తికి మరో ఓటీటీ విజయం దక్కిందా?
ఆ ఊరి పేరు.. చిట్టి జయపురం. ఈ ఊరికి రాజుల కాలం నాటి చరిత్ర వుంది. ఆ ఊరుకంటూ ఒక ప్రత్యేక కట్టుబాట్లు వుంటాయి. తండ్రి మరణంతో వారసత్వంగా వచ్చిన ‘ఊరి పెద్ద’ బాధ్యతల్ని అయిష్టంగానే స్వీకరిస్తుంది అపూర్వ (కీర్తి సురేశ్). ఊరి పెద్దగా ఎలా నెట్టుకొరావాలో తండ్రి దగ్గర ముందే శిక్షణ తీసుకుంటుంది. అయితే ఆమె సిలబస్ లేని ఓ విచిత్రమైన సమస్య ఎదురౌతుంది. చిట్టి జయపురంకు శ్మశానం భూమి కొరత వస్తోంది. కేవలం నలుగురికి మాత్రమే శ్మశానంలో సమాధి చేసేందుకు చోటు ఉంటుందని రచ్చబండ కార్యక్రమంలో ప్రకటిస్తాడు కాటికాపరి చిన్న (సుహాస్). ఊహించని సమస్య వచ్చేసరికి షాక్ అయిన అపూర్వ పరిష్కారానికి ఓ రెండు రోజుల గడువు అడుగుతుంది. మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం వెతికింది? ఈ కథలో భీమయ్య (బాబు మోహన్), మధుబాబు (శత్రు) ఎలాంటి పాత్రలు పోషించారు? చివరి గ్రామ సమస్య ఎలా తీరిందనేది తక్కిన కథ.
కొన్ని కథలు ఐడియా లెవెల్లో బావుంటాయి. భలే కొత్త పాయింట్ దొరికేసిందని దర్శక రచయితలు సంబరపడిపోయేలా వుంటాయి. అయితే సినిమాకి కేవలం ఐడియా సరిపోదు. ఆ ఐడియాలో సగం అయినా స్క్రీన్ పైకి రావాలి. అప్పుడే చూస్తున్న ప్రేక్షకుడికి ఐడియాలోని సారం అందుతుంది. ఉప్పు కప్పురంబు ఐడియాగా కొత్తగానే వుంది. శ్మశానంలో స్థలం లేకపోవడమనే పాయింట్ మీద ఇప్పటివరకూ సినిమాలు రాలేదనే చెప్పాలి. దీని కోసం చిట్టి జయపురం అనే ఫిక్షనల్ ఊరిని క్రియేట్ చేయడం, కథకు పిరియాడిక్ టచ్ తీసుకురావడం ఇవన్నీ ఫ్రెష్‌గానే అనిపిస్తాయి. అయితే అక్కడి నుంచి ప్రేక్షకుడిని కథలో లీనం చేసేటంత సన్నివేశం బలం ఎక్కడా దొరకలేదు.
రానా వాయిస్ ఓవర్లో చిట్టి జయపురంని పరిచయం చేసిన తీరు మెప్పిస్తుంది. నిజానికి ఓ చరిత్రని కొండపల్లి బొమ్మలతో చెప్పే ఆలోచన భలే క్రియేటివ్‌గా అనిపిస్తుంది. ఇంట్రోనే ఇంత కొత్తగా ఆలోచించారంటే మిగతా సీన్స్ అన్నిటిలో చాలా క్రియేటివిటీ వుంటుందనే నమ్మకం కలిస్తుంది. తొలి సమాధి సన్నివేశంలో ఆ ఊరు పాత్రల తీరు చూస్తున్నపుడు దర్శక రచయితలు ఓ సెటైరికల్ కామెడీ రాసుకున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. గ్రామ పెద్దగా అపూర్వ బాధ్యత తీసుకోవడం, రచ్చబండలో ఆమె పడే పాట్లు కొంత హాస్యాన్ని పంచుతాయి. అయితే ఎప్పుడైతే అసలు సమస్య తెరపైకి వస్తుందో… అక్కడ నుంచి కథ, సన్నివేశాలు పరుగులు పెట్టాలి. కానీ ఇక్కడే తేడా జరిగింది. కాన్ఫ్లిక్ట్ని తీసుకొచ్చారేకానీ దాన్ని నడిపిన విధానం అంతగా ఆకట్టుకునేలా వుండదు.
కొత్త పాయింటే అయినా చాలా చిన్న పాయింట్ ఇది. ఇలాంటి కథలకు సన్నివేశాల బలం అవసరం. పాత్రల్ని కొత్తగా ఆసక్తికరంగా మలచాలి. ఉప్పు కప్పురంబులో ఈ రెండూ లోపించాయి. అపూర్వ, చిన్న పాత్రలు, వాటి లక్ష్యాలు ఇందులో కీలకం. ఎక్కడో క్లైమాక్స్‌లో తప్ప ఈ రెండు పాత్రల్ని ఎంగేజింగ్‌గా మలుచుకోలేదు దర్శకుడు. ఇలాంటి కథల్లో దర్శక రచయితలు అంతర్లీనంగా ఏదైనా ఒక సమస్య లేదా సందేశాన్ని చెప్పాలని చూస్తారు. ఇందులో వారసత్వం, డబ్బు, అధికారం, ఈగో, చివరికి మిగిలేది… ఇలాంటి విషయాలన్నిటిని సబ్టెక్స్ట్గా చూపించాలని భావించారు. కానీ అవి అంత ఆసక్తికరంగా కుదరలేదు.
గ్రామ పెద్ద పాత్రలో కీర్తి సురేశ్ ఓ కొత్తరకం బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌ని ప్రయత్నించింది. రచ్చబండ సీన్లో అయితే “ఏంటి ఇంత ఓవర్ యాక్షన్?” అనే ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత ఆ పాత్రని మెల్లగా ట్యూన్ చేసుకుంటూ వచ్చారు. కామెడీలో కొంచెం కొత్తగా ప్రయత్నించింది. ఆమె లుక్ కూడా వింటేజ్ వైబ్ ఇస్తుంది. సుహాస్‌కి మరో ఎమోషనల్ క్యారెక్టర్ ఇది. క్లైమాక్స్‌లో తన నటన ఆకట్టుకుంటుంది. బాబు మోహన్‌కి సరైన సీన్స్ పడలేదు. శత్రుతో కూడా వెరైటీ కామెడీ ట్రై చేశారు. తాళ్ళూరి రామేశ్వరి ఎప్పటిలాగే తనకు అలవాటైన మాడ్యులేషన్లో చేసింది.
పాటలు రిజిస్టర్ కావు కానీ నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో చిట్టి జయపురంని డిజైన్ చేయడం కొత్త టోన్ తీసుకొచ్చింది. దర్శకుడు ఎత్తుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ ఎంగేజింగా చెప్పడంలో చాలా లోపాలు కనిపించాయి. ఐడియాని కొత్తగా ఆలోచించిన దర్శకుడు కథనంపై దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకాస్త మెరుగ్గా వుండేది.