మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడుతూ.. సానుభూతిపరులుగా, మేధావులుగా చెలామణి అయ్యే వారికి ఎన్ఐఏ గట్టి షాక్ ఇవ్వబోతోంది. అలాంటి వారిని అర్బన్ నక్సల్స్ కేటగిరీలో చేర్చి అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చాలా మందికి నోటీసులు వెళ్లాయి. సోషల్ మీడియా ఖాతాలను వెట్టింగ్ చేసి.. నక్సల్స్ కు మద్దతుగా ఉంటున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాము హాయిగా ఉంటూ రెచ్చగొట్టే వాళ్లే అర్బన్ నక్సల్స్
ఓ వైపు మావోయిస్టుల పేరుతో కొంత మంది కుటుంబాలను వదిలేసి అడవుల్లో ఉంటే.. సిటీల్లోఉండే కొంత మంది వారి మద్దతుదారులమని మేధావులమని చెప్పుకునేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. ఎన్ కౌంటర్ అయినప్పుడు మీ త్యాగం మరువదు.. ఒక్క హిడ్మాను ఎన్కౌంటర్ చేస్తే వంద మంది హిడ్మాలు వస్తారు..అని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. అంతేనా.. ప్రతీకారం తీర్చుకుంటామని..తామే స్వయంగా మావోయిస్టులం అయినట్లుగా ప్రకటనలు చేస్తూంటారు. ఇలాంటి అర్బన్ నక్సల్స్ సంగతి కూడా తేల్చాల్సి ఉందని ఎన్ఐఏ గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ప్రజా జీవితంలోకి రావడానికి అన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వాలు
మావోయిస్టు ఉద్యమం ఫెయిలయింది. ప్రజాదరణ కోల్పోయింది. అకారణంగా ప్రజల్ని, రాజకీయ నేతల్ని, పోలీసుల్ని చంపడం వల్ల.. వారిని ఎన్ కౌంటర్ చేస్తే ఎవరూ స్పందించలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో కేంద్రం.. దేశ అంతర్గతభద్రతాసవాళ్లను పరిష్కరించేయాలని నిర్ణయించుకుంది. మావోయిస్టులందరికీ లొంగిపోయే అవకాశం కల్పించింది.ప్రజా జీవితంలోకి వచ్చే వారికి .. కేసులు లేకుండా బతకడానికి సాయం చేసేందుకు అంగీకరించింది. అయినా మాది తుపాకీ గొట్టమే.. కనిపించిన వాళ్లను కాల్చేస్తాం అన్న వారిని మాత్రమే వేటాడుతున్నారు. వారిని అలా వదిలేస్తే మరెన్నో ప్రాణాలు బలి తీసుకుంటారు. విజయవాడలో నక్సలైట్లు దొరికినప్పుడు.. వారు ఓ ప్రముఖుడ్ని అంతమొందించడానికి ప్లాన్ చేశారన్నదానికి ఆధారాలు లభించాయని ప్రచారం జరిగింది. దీనికి ఎవరు సమాధానం చెబుతారు?
అర్బన్ నక్సల్స్ తోనే అసలు సమస్య
నక్సల్స్ గురించి సానుభూతి మాటలు చెబుతూ.. వారికి మద్దతుగా సిటీల్లో ఉంటూ బతికేవారిది లగ్జరీ లైఫ్. వారి ఇళ్లలో నాలుగైదుఏసీలు ఉంటాయి. ప్రతి గది చల్లగా ఉంటుంది. ఇంట్లోనూ చెప్పులతోనే నడుస్తారు. కాలు కింద పెట్టరు. కానీ వారు ఇతరులు..యువత అడవుల బాటపట్టడానికి రెచ్చగొట్టేలా కవితలు, కథలు, ప్రసంగాలు ఇస్తారు. తిరుగుబాటే శరణ్యమంటారు. అలాంటి వారి వల్ల సమాజానికి, యువతకు ముప్పు వస్తుంది. ముందు వీరిని కంట్రోల్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఎన్ఐఏ సీరియస్ గా తీసుకుంది.
