కాంగ్రెస్ పార్టీ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విషయంలో చేసిన పొరపాట్ల కారణంగా ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సిన వస్తోంది. రైతులకు అత్యంత కీలకమైన యూరియాను అవసరమైనంత మేర అందుబాటులో ఉంచకపోవడంతో పెను సమస్యగా మారింది. డిమాండ్ ను అంచనా వేయకపోవడం, కేటాయించిన యూరియా దారి తప్పకుండా చూడటంలో విఫలమైన కారణంగా ఇప్పుడు ప్రభుత్వ సమర్థతపై ప్రశ్నలు రేకెత్తించేలా చేస్తుంది.
యూరియా కోసం రైతుల పడిగాపుుల
తెలంగాణలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడి, కొన్నిసార్లు వర్షంలో తడుస్తూ ఒక్క బస్తా యూరియా కోసం వేచి ఉంటున్నారు. సిరిసిల్ల, కరీంనగర్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆందోళనలు కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరా సమస్యను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందన్న ఆరోపణలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.
కొరత కన్నా బ్లాక్ మార్కెటింగ్ వల్లే సమస్య
యూరియా కొరత సమస్య కాదని.. పారదర్శక పంపిణీ లేకపోవడం, బ్లాక్ మార్కెటింగ్ , దుర్వినియోగాన్ని అరికట్టలేకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని ఎక్కువగా విమర్శలు ఉన్నాయి. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)లో సాంకేతిక సమస్యల కారణంగా 2025 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 78 రోజుల పాటు యూరియా ఉత్పత్తి ఆగిపోయింది, ఇది రాష్ట్రంలో యూరియా కొరతను మరింత తీవ్రతరం చేసింది. పారిశ్రామిక అవసరాల కోసం యూరియాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అసలు కేటాయించినది ఎంత.. రైతులకు సరఫరా చేసినది ఎంత అని లెక్కలు తీస్తే చాలా తేడా కనిపిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
కేంద్రంపై ఆరోపణలు చేస్తే సమస్య పరిష్కారం కాదు !
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 8.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ, కేవలం 5.32 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందని ఆరోపిస్తున్నారు. దీనివల్ల 2.69 లక్షల టన్నుల లోటు ఏర్పడిందని ఆరోపించారు. ఈ లోటు కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రకటించారు. ఢిల్లీ కి వెళ్లి ఆగస్టు నెలలో 3 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు. అయితే ఇలాంటి విజ్ఞప్తులు.. విమర్శలు కాదు రైతులకు కావాల్సింది. వారికి యూరియా ఇస్తేనే సమర్థంగా పని చేసినట్లు.. లేకపోతే.. పని చేయనట్లే. ప్రభుత్వంలో ఉన్న వారు గుర్తించాల్సింది ఇదే.