దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందని… కానీ రైతులకు సరిపడినంత యూరియాను అందిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఏపీలో పరిస్థితి అంత తీవ్రంగా లేదు. క్యూ లైన్లు ఉన్నా.. అందరికీ యూరియా అందిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంది. రైతులు సహకార సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల అసహనానికి గురై దాడులు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులు తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి.
నిజానికి యూరియా ఎంత అందుబాటులో ఉందో అధికారులకు స్పష్టత ఉంది. అంత మేరకు అందరికీ ఇస్తామని .. ఏ సమయంలో వచ్చి తీసుకోవాలో ముందుగానే సమాచారం ఇస్తే ఇలాంటి సమస్య రాదు. కానీ అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఓ సొసైటీకి వచ్చిన యూరియాను తీసుకోవడానికి రైతులంతా పోలోమంటూ వస్తున్నారు. వారిలో కొద్ది మందికే దొరుకుతోంది. దాని కోసం అంతా పోటీ పడాల్సి వస్తోంది.
రైతులకు యూరియా సరఫరా చేయాడనికి అవసరమైన వారికి .. టోకెన్లు తీసుకున్న వారికి సరైన సమాచారం ఇస్తే.. చాలా వరకూ క్యూలను కంట్రోల్ చేయవచ్చు కానీ అలాంటి ప్రయత్నాలు అధికారులు చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. క్యూలైన్లలో నిల్చునే వారికి సహజంగానే ఆగ్రహం వస్తుంది. సహనం కోల్పోతారు. అలాంటివే జరుగుతున్నాయి. క్యూలైన్లు ఉండకుండా.. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి కాస్త కష్టమైనా హోం డెలివరీ ఆప్షన్ ప్రభుత్వాలు పరిశీలిస్తే..సమస్య తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయి. పథకాలన్నీ ఇంటింటికి పంపుతున్నప్పుడు.. వీటిని పంపిణీ చేయడానికి వ్యవస్థ ఉండదని అనుకోలేరు.