కొన్నాళ్ల కిందట ఉప్పు కొరత అని ప్రచారం జరిగింది. అంతే ఎక్కడా ఉప్పు ప్యాకెట్లు లేకుండా జనం కొనేశారు. దాంతో నిజంగానే కొరత వచ్చింది. నాలుగైదు నెలలకు కేజీ ఉప్పు వాడే కుటుంబాలు.. కొరత పేరుతో ఇక దొరకదేమో అన్నట్లుగా జీవిత కాలానికి సరిపడా ఒకే సారి కొంటే.. కొరత రాక ఏమి వస్తుంది ?. ఇలా ఒకరిని చూసి ఒకరు ఇలా కొంటే ఎంత ఉత్పత్తి చేస్తే.. డిమాండ్ తీరుతుంది..? ఖచ్చితంగా ఇదే ఫార్ములాను యూరియా విషయంలో అవలంభించేందుకు.. ఫేక్ ప్రచారానికి వైసీపీ రెడీ అయింది.
యూరియా కొరత పేరుతో రైతుల్లో అలజడి రేపే ప్రయత్నం
జగన్ రెడ్డి ఓ ఫేక్ ఫోటోను ట్వీట్ చేసి..యూరియా కొరత ఉందని..యూరియా ఇవ్వలేకపోతున్నారని ట్వీట్ చేశారు. నిజానికి అది ఫేక్ ఫోటో. యూరియా కొరత ఎక్కడా లేదు. కేవలం రైతుల్లో ఓ పానిక్ ను సృష్టించి.. రైతులందర్నీ యూరియా కోసం ఎగబడేలా చేయడానికే జగన్ రెడ్డి వేసిన పక్కా ప్లాన్ . ఆయన బాటలోనే వైసీపీ సోషల్ మీడియా కూడా రచ్చ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. జగన్ రెడ్డి స్వయంగా ఫేక్ చేస్తే..ఇక కింద వాళ్లు ఊరుకుంటారా ?
ప్రధాన మీడియా కూడా అంజడి కుట్రలో భాగమే !
సాక్షి మీడియాకు సిస్టర్ చానళ్లుగా ఉన్న టీవీ9, ఎన్టీవీ కూడా ఈ కుట్రలో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల యూరియా కొరత .. రైతుల్లో క్యూల్లో ఉన్నారంటూ కథనాలు ప్రారంభించాయి. యూరియా కోసం వచ్చి లైన్ లో నిలబడి అవసరమైన యూరియా తీసుకోవడం కూడా కొరత అంటే ఎలా?. ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరాలు ఇచ్చింది. ఎంత యూరియా అవసరం.. ఎంత అందుబాటులో ఉంది.. ఎంత యూరియా రాబోతోందన్న దానిపై స్పష్టమైన ప్రణాళికతో ఉంది. కానీ… రైతుల్లో అలజడి రేపి యూరియా కోసం ఎగబడేలా చేసే కుట్రలో ఈ చానేళ్లు భాగం అవుతున్నాయని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు ఘాటు హెచ్చరికలు – పోలీసులూ అలాగే వ్యవహరించాలి !
రైతుల పేరుతో ఫేక్ చేస్తే తాట తీస్తానని చంద్రబాబు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ఎప్పుడూ అలాగే అంటారని.. తమ ఫేక్ తాము చేయాలనుకుంటారని చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి నుంచే ఆ చర్యలు ప్రారంభిస్తే.. రైతుల్లో అలజడి రేపాలనుకునేవారికి భయం ఉంటుంది. లేకపోతే…. ఫేక్ చేశారని ..అలజడి రేపారని ప్రత్యారోపణలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ జరగాల్సినా నష్టం జరుగుతుంది.