రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా భారత్కు 30 రోజుల పాటు అనుమతినిస్తూ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంగా భారత్ తన ఇంధన అవసరాల కోసం మరొక దేశం అనుమతి తీసుకోవాల్సి రావడంపై సామాన్య ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మన డబ్బుతో మనం ఎవరి దగ్గరైనా చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛ మనకు ఉండాలి కానీ, అమెరికా నిర్దేశించిన గడువుల ప్రకారం భారత్ నడుచుకోవాల్సి రావడం దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా మారుతోంది.
భారత సార్వభౌమత్వం సంగతేమిటి?
ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మోదీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని, భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వాషింగ్టన్ పాదాల దగ్గర పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పన్నుల బూచి చూపించి ట్రంప్ చేస్తున్న బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భారత్ తలొగ్గడం వల్లే ఈ అనుమతి పత్రం వచ్చిందని, ఇది దేశ సార్వభౌమత్వానికే గొడ్డలి పెట్టు అని విమర్శిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చుతోంది. తాము రష్యా నుండి చమురు కొనుగోలు ఎప్పుడూ ఆపలేదని, అమెరికా ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది.
అలాంటిదేమీ లేదంటున్న కేంద్రం
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం , ఇరాన్ చమురు సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగకుండా ఉండేందుకే అమెరికా ఈ వెసులుబాటు ప్రకటించింది. కానీ, ఈ ప్రకటనను అమెరికానే నేరుగా చేయడంతో మోదీ సర్కార్ ఇరకాటంలో పడింది. భారత్ తన నిర్ణయాలను సొంతంగా తీసుకుంటోందా లేక అమెరికా కనుసన్నల్లో నడుస్తోందా అన్న సందేహం సామాన్యుల్లో కలగడానికి ఈ అధికారిక ప్రకటన కారణమైంది. రష్యా వంటి మిత్రదేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలను కూడా అమెరికా శాసిస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
భారత్ లాంటి దేశాలపై ట్రంప్ సవారీ
ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంది. పన్నుల బెదిరింపులతో మొదలుపెట్టి, ఇప్పుడు చమురు కొనుగోళ్లపై గడువుల వరకు అమెరికా జోక్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రజలు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక దౌత్య విజయంగా చూస్తారా లేక లొంగుబాటుగా భావిస్తారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. భారతదేశ ఇంధన భద్రత ఇతర దేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండకూడదన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
