అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన కీలక చర్చలు ఎటువంటి నిర్ణయాత్మక ఒప్పందం లేకుండానే ముగిశాయి. గత కొద్దివారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ప్రధానంగా అణు కార్యక్రమాల నియంత్రణ , హోర్ముజ్ జలసంధిలో రాకపోకలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ దౌత్య ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలితాన్ని ఇవ్వలేదు.
ఈ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఇరాన్ పట్ల అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతిపాదించిన నిబంధనలను ఆమోదించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. అణు ఆయుధాల తయారీని పూర్తిగా నిలిపివేయాలన్న మా రెడ్ లైన్ విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. ఒప్పందం కుదరకపోవడం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. అటు అధ్యక్షుడు ట్రంప్ సైతం చర్చలు విఫలమైనా తమకు నష్టమేమీ లేదని, ఏ రకంగానైనా అమెరికాదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ఈ పరిణామాలపై సంయమనంతో స్పందించింది. దశాబ్దాల కాలంగా ఉన్న విభేదాలను కేవలం ఒకే ఒక్క సమావేశంతో పరిష్కరించుకోలేమని ఇరాన్ పేర్కొంది. అమెరికా డిమాండ్లు అత్యుత్సాహంతో కూడినవిగా ఉన్నాయని, తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే శాంతి చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల ఎత్తివేత ,స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై ఇరాన్ పట్టుబడుతుండటం ఈ ప్రతిష్ఠంభనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఈ చర్చలు విఫలం కావడం వల్ల గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరమైన ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేయడం వల్ల ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇరుపక్షాలు తదుపరి రౌండ్ చర్చలకు పాకిస్థాన్ ప్రతిపాదనను పరిశీలిస్తుండటం కొంత సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.
