అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత యుద్ధ వాతావరణం, ట్రంప్ పిలుపునిస్తున్న తిరుగుబాటుకు భిన్నంగా అమెరికా లోపలే పెను రాజకీయ సంక్షోభానికి దారితీస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ప్రజలను తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పదేపదే కోరుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇరాన్ ప్రభుత్వం కఠినమైన చర్యలతో నిరసనలను అణిచివేస్తుండగా, అమెరికాలో మాత్రం నో కింగ్స్ పేరుతో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమాలు మొదలయ్యాయి. దాదాపు 80 నుండి 90 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి రావడం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా రికార్డు సృష్టించింది.
పెజెష్కియన్ ఓపెన్ లెటర్ వ్యూహం
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నేరుగా అమెరికా ప్రజలను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ యుద్ధం ఎవరి కోసం? మీ పన్నుల డబ్బు ఎవరి ప్రయోజనాల కోసం ఖర్చవుతోంది? అని ఆయన సంధించిన ప్రశ్నలు సగటు అమెరికన్లలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ట్రంప్ చెబుతున్న అమెరికా ఫస్ట్ నినాదం ఇప్పుడు ఇజ్రాయెల్ ఫస్ట్ గా మారిందని, అమెరికా కేవలం ఇజ్రాయెల్ కోసం ప్రోక్సీ గా మారి యుద్ధం చేస్తోందని ఆయన చేసిన ఆరోపణలు ట్రంప్ వ్యతిరేక వర్గానికి బలమైన అస్త్రాలుగా మారాయి. చివరి అమెరికన్ సైనికుడు, చివరి అమెరికన్ పన్ను చెల్లింపుదారుడి డాలర్ మిగిలే వరకు ఇరాన్‌తో యుద్ధం చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది అనే పెజెష్కియన్ వ్యాఖ్యలు ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ఆత్మరక్షణలో పడేశాయి.
నో కింగ్స్ ఉద్యమంతో ట్రంప్ ఇబ్బందులు
ట్రంప్ తన రెండో విడత పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఇరాన్‌పై యుద్ధం , దేశీయంగా ఇమ్మిగ్రేషన్ విభాగం ద్వారా చేపడుతున్న కఠిన చర్యలు అమెరికన్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు అంటే రాజు కాదు అనే నినాదంతో సాగుతున్న నో కింగ్స్ ర్యాలీలలో ప్రముఖులు కూడా పాల్గొనడం ఈ ఉద్యమ తీవ్రతను తెలియజేస్తోంది. యుద్ధం వల్ల పెరుగుతున్న చమురు ధరలు, స్టాక్ మార్కెట్ పతనం వంటివి మధ్యతరగతి అమెరికన్లను ట్రంప్‌కు దూరం చేస్తున్నాయి.
ముంచుకొస్తున్న రాజకీయ సంక్షోభం
ఇరాన్ తన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులకు మరింత విధ్వంసకరంగా సమాధానం ఇస్తాం అని హెచ్చరిస్తుండగా, మరోవైపు అమెరికా లోపల పెరుగుతున్న పౌర నిరసనలు ట్రంప్ పాలనకు సవాలుగా మారాయి. యుద్ధం సుదీర్ఘంగా సాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్లో మార్పు కోరుకున్న ట్రంప్‌కు, ఇప్పుడు తన స్వదేశంలోనే తన నాయకత్వంపై వస్తున్న తిరుగుబాటును అడ్డుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ తెలివిగా అమెరికా ప్రజల ఆర్థిక , భావోద్వేగ అంశాలను స్పృశిస్తూ .. ట్రంప్ అమ్ములపొదిలోని జాతీయవాదం అనే అస్త్రాన్ని ఆయనపైనే ప్రయోగించేలా చేస్తున్నారు. ట్రంప్ మూర్ఖంగా ముందుకెళ్తే మరిన్ని సమస్యలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.


