పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం ఆరో వారానికి చేరుకుంది. శనివారం ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కూలిపోవడం ఈ యుద్ధంలో ఒక కీలక మలుపుగా మారింది. ఇరాన్ దళాలు ఈ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించగా, అందులోని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని అమెరికా దళాలు రక్షించాయి, మరొక పైలట్ ఆచూకీ ఇంకా లభించలేదు. దీనికి తోడు, కువైట్‌లో అమెరికా హెలికాప్టర్ ధ్వంసమైంది.
ఆగని ట్రంప్ బెదిరింపులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇరాన్‌కు 48 గంటల గడువువిధిస్తూ, ఒకవేళ చర్చలకు రాకపోయినా లేదా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరవకపోయినా, ఇరాన్‌పై ఊహించని రీతిలో భారీ దాడులు తప్పవని హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏప్రిల్ 6 లోపు ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశ ఇంధన కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తామని అమెరికా స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ దీర్ఘకాల యుద్ధ వ్యూహం
మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్ మిత్రపక్షమైన హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ సరిహద్దుల్లో సెక్యూరిటీ జోన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇరాన్ నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పైకి క్షిపణి దాడులు కొనసాగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ తన గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా వాటిని అడ్డుకుంటోంది. ఇరాన్ అణు , బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా ఉమ్మడి వైమానిక దాడులు ఫిబ్రవరి చివరి నుంచి నిరంతరాయంగా సాగుతున్నాయి.
చర్చల్లో బ్రేక్ త్రూ ఉందా?
ప్రస్తుతానికి శాంతి చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అమెరికా పంపిన 15 అంశాల ప్రతిపాదనను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తిరస్కరించారు, చర్చలకు ఎటువంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా కొన్ని సందేశాలు అందుతున్నప్పటికీ, నేరుగా చర్చలు జరపడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నారు. అయితే, ఇరుపక్షాలు తమ పంతం వీడకపోవడంతో అగ్నిగుండంగానే ఉంది.
