అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంతం నెగ్గించుకున్నారు. వెనిజులా అధ్యక్షుడ్ని పట్టి ఇస్తే 50 మిలియన్ డాలర్లు ఇస్తామని గతంలో ప్రకటన చేశారు. ఇప్పుడు నేరుగా వెనిజులా రాజధాని కారకస్‌పై దాడి చేసి వెనిజులా అధ్యక్షుడ్ని , ఆయన భార్యను కూడా బంధించారు. వారిని కారకస్ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు..ఏం చేస్తారన్నది ట్రంప్ ప్రకటించనున్నారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆ దేశానికి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. కానీ ఆయనపై అమెరికా చాలా కాలంగా గుర్రుగా ఉంది. ఎందుకంటే వెనిజులా నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తాయని.. ఆ డ్రగ్స్ మాఫియాకు ఓనర్ మదురోనేనని అమెరికా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే బైడెన్ హయాంలోనూ మదురోకు వ్యతిరేకంగా రివార్డు ఉంది. అయితే ట్రంప్ అలా రివార్డు ప్రకటించి వదిలేసే వ్యక్తి కాదు కాబట్టి .. నేరుగా ఆ దేశంపై దాడి చేసి ఆయనను బందీగా తీసుకుని వచ్చేలా సైన్యాన్ని ఉపయోగించారు.
ఇలా దాడులు చేసి బంధించే ముందు కారకస్‌లో చైనా బృందం పర్యటించింది. చైనా బృందానికి మదురో తాను టైగర్‌నని చెబుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. చైనా బృందంతో సమావేశాలు జరిగిన కొన్ని గంటల్లోనే ఆయనను అమెరికా బంధించి తీసుకెళ్లిపోయింది. అమెరికా సైన్యం .. అధ్యక్ష భవనంపై దాడులు చేస్తున్నా.. వెనిజులా సైన్యం ప్రతిస్పందించలేకపోయింది. అత్యంత తక్కువ ఎత్తులో వచ్చిన అమెరికా యుద్ధ విమానాలు పని పూర్తి చేసుకుపోయినట్లుగా చెబుతున్నారు.
ఈ వ్యవహారం అంతర్జాతీయ సమాజంలో సంచలనం సృష్టిస్తోంది. ట్రంప్ పద్దతి సరి కాదన్న వాదన వినిపిస్తోంది. కానీ ఆయన ఎవరి మాటా వినరు. తదుపరి పరిణామాలేమిటన్నది కొన్ని గంటల్లోనే క్లారిటీ రానుంది.
