వెనిజులా అధ్యక్షుడిని గద్దె దించి, అక్కడి అధికార పగ్గాలను పరోక్షంగా నియంత్రించాలని అమెరికాకు అసలు సమస్యలకు తోడు మరిన్ని కొత్త సమస్యలు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో అమెరికా జరిపిన ప్రయోగాలు ఘోరంగా విఫలమై, ఆ దేశాలను దశాబ్దాల పాటు అరాచకంలోకి నెట్టాయి. ఇప్పుడు వెనిజులాలోనూ అదే తరహా పాలన మార్పు వ్యూహాన్ని అమలు చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
పరోక్ష పాలన సాధ్యమేనా?
అమెరికా భావిస్తున్నట్లుగా వెనిజులాలో ఒక తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఉంచి పాలన సాగించడం అంత సులువు కాదు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, స్థానిక వ్యతిరేకత దృష్ట్యా అమెరికా తన సైన్యాన్ని మోహరించడం దాదాపు అసాధ్యం. బలమైన స్థానిక ప్రభుత్వం లేని పక్షంలో అక్కడ అధికార శూన్యత ఏర్పడి, దేశం మొత్తం అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్న నెపంతో చేసే ఈ ప్రయత్నం, అంతిమంగా ఆ దేశాన్ని మరో అంతర్యుద్ధంలోకి నెట్టే అవకాశం ఉంది.
చమురు, డ్రగ్స్ మాఫియా సవాళ్లు
వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలపై పట్టు సాధించాలన్నది అమెరికా ప్రధాన ఉద్దేశ్యం అయినప్పటికీ, అస్థిరత నెలకొన్న దేశంలో చమురు ఉత్పత్తిని నియంత్రించడం కష్టసాధ్యం. అంతే కాకుండా, ప్రభుత్వం బలహీనపడితే డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు , మాఫియా వర్గాలు రాజ్యమేలుతాయి. ఇప్పటికే లాటిన్ అమెరికాలో వేళ్లూనుకున్న డ్రగ్స్ నెట్వర్క్ను కట్టడి చేయడం అమెరికాకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఇది అమెరికా సరిహద్దుల్లో భద్రతా పరమైన సమస్యలను మరింత పెంచుతుంది.
అమెరికాకు ట్రంప్ గండం
సమస్యను పరిష్కరించే క్రమంలో అమెరికా అవలంబిస్తున్న ఈ దూకుడు వైఖరి, సమస్యను తగ్గించాల్సింది పోయి మరింత జటిలం చేస్తోంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న ప్రతిసారీ అక్కడ విధ్వంసమే మిగిలిందన్న చేదు నిజాన్ని చరిత్ర గుర్తు చేస్తోంది. వెనిజులా విషయంలో కూడా అమెరికా తన పంథాను మార్చుకోకపోతే, అది ఆ ప్రాంతంలో శాశ్వత అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. అది అంతిమంగా అమెరికాకు పెను సమస్యలు సృష్టించనుంది. ట్రంప్ దిగిపోయినా… ఆ పర్యవసానాలు అమెరికా అనుభవించాల్సి ఉంటుంది.
