ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు బహిరంగ పోరాటంగా మారి ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించింది. అమెరికా అతి జోక్యం వల్లనే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు, ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీసి ప్రపంచ దేశాలను ఇంధన, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయి. ఇప్పుడు అమెరికాకూ చేతులు కాలాయి. అందుకే జరగని చర్చల్ని కారణంగా చూపించి.. ఆయన దాడుల్ని ఆపేశారు.
ట్రంప్ హయాం నాటి నిర్ణయాల ప్రభావం
డొనాల్డ్ ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. 2015 నాటి ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడం, ఇరాన్ సేనాధ్యక్షుడు ఖాసీం సులేమానీని హతమార్చడం వంటి చర్యలు ఇరాన్‌ను తీవ్రంగా రెచ్చగొట్టాయి. ఇజ్రాయెల్‌కు పూర్తిస్థాయిలో కొమ్ముకాస్తూ, ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న అమెరికా వ్యూహం.. ఆ రెండు దేశాల మధ్య ఉన్న పాత కక్షలను ప్రపంచంపై రుద్దినట్లుగా మారింది.
అమెరికా జోక్యంతో అసలు సమస్య
పశ్చిమ ఆసియాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు తరచుగా ఎదురుదెబ్బలు తింటున్నాయి. ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సంపత్తిని అందించడం ద్వారా ఇరాన్‌ను కట్టడి చేయవచ్చని అమెరికా భావిస్తోంది, కానీ ఇది మరోవైపు ప్రాక్సీ వార్ కు దారితీస్తోంది. హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలను అడ్డుపెట్టుకుని ఇరాన్ చేస్తున్న దాడులు, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ జరుపుతున్న క్షిపణి దాడులు చివరకు ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఈ విషయంలో తటస్థంగా ఉండి ఉంటే, ఈ సమస్య ఇంతటి ప్రపంచ సంక్షోభంగా మారేది కాదన్న వాదన బలంగా ఉంది.
వదిలేస్తేనే ప్రశాంతత
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న విభేదాలు కేవలం సరిహద్దులకు సంబంధించినవి కావు.. అవి మతపరమైన, సైద్ధాంతికమైన పోరాటాలు. వీటిని ఏ బాహ్య శక్తి కూడా పరిష్కరించలేదు. అమెరికా తన ఆర్థిక , సైనిక ప్రయోజనాల కోసం ఈ గొడవలో తలదూర్చింది చేతులు కాల్చుకుంది. ఇప్పటికైనా ఈ సమస్యను ఆ రెండు దేశాలకే వదిలేయాల్సిన అవసరం ఉంది. అగ్రరాజ్యాల జోక్యం లేకపోతే, ప్రాంతీయ శక్తులు తమంతట తాముగా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది లేదా కనీసం ఈ గొడవ ఇతర దేశాలకు పాకకుండా జాగ్రత్త పడవచ్చు.
ప్రపంచంపై ఆర్థిక భారం
ప్రస్తుతం సామాన్య ప్రజానీకం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రతిసారీ క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తోంది. అమెరికా తన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న యుద్ధ తంత్రం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికైనా అమెరికా మేల్కొని, ఇరాన్-ఇజ్రాయెల్ గొడవను ఆ రెండు దేశాలసమస్యగానే పరిగణించాలి. దౌత్యపరమైన చర్చలకు అవకాశం కల్పించాలే తప్ప, ఒక వర్గం వైపు నిలబడి మరో వర్గాన్ని రెచ్చగొట్టకూడదు. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది. ట్రంప్ దీన్ని గుర్తించినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.


