భారత్ పై అమెరికా 25 శాతం పన్నులు విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు పెనాల్టీ కూడా వేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఈ పన్నుల విధింపు కారణంగా భారత్ నుంచి ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ పరిశ్రమలపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. అయితే నిన్నటి వరకూ ట్రేడ్ డీల్ పై చర్చలు జరుగుతున్నాయని దాదాపుగా ఖరారు అయిపోయిందన్న ప్రచారం జరిగింది. కానీ చివరికి ఏదీ జరగలేదు. చర్చలు కూడా జరుగుతున్నట్లుగా అప్ డేట్ లేదు.
ప్రధాని మోదీతో డొనాల్డ్ ట్రంప్ కు చాలా స్నేహం ఉంది. వారికి దేశాధ్యక్షులుగానే పరిచయం ఉంది. వ్యక్తులుగా లేదు. అందుకే ప్రధాని మోదీతో ట్రంప్ స్నేహం దేశానికి మేలు చేస్తుందని అనుకున్నారు. ట్రేడ్ డీల్ లో భారత్ కు మేలు జరగకపోయినా… ఇప్పుడు ఉన్న పన్నుల విధానాన్ని కొనసాగిస్తారని అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు..భారత్ మిత్రదేశమే కానీ.. పన్నులు వేస్తామని ట్రంప్ ప్రకటించేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్రంప్ పన్నుల విధింపు ప్రకటన తర్వాత భారత్ స్పందించింది. భారతీయ వ్యాపార ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు కాపాడే దిశగా చర్చలు చేశామని.. వారి ప్రయోజనాలను కాపాడేందుకు రాజీపడబోమని తెలిపింది. ట్రంప్ వ్వహారశైలి గురించి తెలిసిన వారు.. ఇండియాలో మార్కెట్ ను అమెరికా కంపెనీలకు దోచి పెట్టాలని అనుకుంటారు కానీ అమెరికాలో మార్కెట్ ఇండియన్లకు ఓపెన్ చేస్తారని అనుకోరు. చివరికి భారత్ లోకి నాన్ వెజ్ పాలను కూడా గుమ్మరించాలని అనుకున్నారు.
ప్రధాని మోదీ ఈ ట్రేడ్ డీల్ విషయంలో.. ట్రంప్ ను డీల్ చేయలేకపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. భారత్ కు జరిగే నష్టాన్ని ఎలా పూరించాలన్నదానిపై కేంద్రం తీసుకునే నిర్ణయాలే కీలకం.