భారత మాజీ ప్రధాని , భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా అన్ని చోట్లా వేడుకలు నిర్వహించారు . అయితే ఏపీలో మాత్రం బీజేపీ నేతలు మరింత హడావుడి చేశారు. ఉమ్మడి జిల్లాల్లో వాజ్ పేయి విగ్రహావిష్కరణలు చేస్తూ యాత్రలు చేశారు. ఆ యాత్రల్లో పాల్గొలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. తాను స్వయంగా రెండు చోట్ల విగ్రహావిష్కరణల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ రోజునే వాజ్ పేయి బర్త్ డే కావడంతో అమరావతిలో విగ్రహావిష్కరణ, బహిరంగసభ కూడా నిర్వహించారు. చంద్రబాబు కూడా హాజరయ్యారు.
వాజ్ పేయి జయంతిని బీజేపీ రాజకీయంగా బలపడేందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినా.. చంద్రబాబు సహకరించారు. వాజ్‌పేయితో చంద్రబాబుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఆరేళ్లు కొనసాగడంలో చంద్రబాబు సహకారాన్ని ఎవరూ మర్చిపోలేరు. అలాగే 1985లో నాదెండ్ల తిరుగుబాటు సమయంలో ఢిల్లీ స్థాయిలో ఎన్టీఆర్‌కు, టీడీపీకి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వాజ్ పేయి సహకారం మర్చిపోలేనిది. ఆ సహకారాన్ని సమన్వయం చేసింది చంద్రబాబే. ఎన్టీఆర్‌ను వాజ్ పేయి.. తన నివాసంలో రెండు రోజులు ఉంచి.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు.
తర్వాత ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వాజ్ పేయి రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టంలో టీడీపీ మద్దతు కీలకం. అలాగే వాజ్‌పేయి హయాంలో ఏపీకి గరిష్టంగా కేంద్రం నుంచి ప్రయోజనాలు పొందడంలోనూ చంద్రబాబు వాజ్‌పేయితో సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్నారు. అందుకే ఆయనపై చంద్రబాబుకూ ప్రత్యేక అభిమానం. ఈ కారణంగానే వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో సహకారం అందించారు.
