ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సోదరుడు నాగబాబు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలనే అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు తగిన గుర్తింపు లభించలేదని పవన్ అభిప్రాయపడ్డారు. కేవలం జిల్లాకు లేదా చిన్న చిన్న సంస్థలకు ఆయన పేరు పెట్టడం కాకుండా, రాష్ట్రానికి వెన్నెముక వంటి పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెడితే ఆ మహనీయుడి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని పవన్ భావిస్తున్నారు. నాగబాబు కూడా అదే చెబుతున్నారు. ఆర్యవైశ్యులు పార్టీలో చేరే కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ఆర్ పేరు పెట్టిన జగన్
పోలవరం ప్రాజెక్టుకు వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. దీనికి 019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పోలవరం ప్రాజెక్ట్ అని పేరు మారుస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. కానీ ఎవరూ ఆ పేరుతో పిలవడం లేదు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో దీనికి ఇందిరా సాగర్ అని పేరు ఉండేది. వైఎస్సార్ హయాంలో కూడా అదే పేరు కొనసాగింది. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇందిరా గాంధీ పేరు స్థానంలో తన తండ్రి పేరును చేర్చారు. జగన్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పేరు మార్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం , పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రికార్డులలో ఇది ఇప్పటికీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గానే ఉంది.
వాజపేయి పేరుపై గతంలో టీడీపీ సానుకూలత
పోలవరం ప్రాజెక్టుకు వాజ్ పేయి పేరు పెట్టాలనే ప్రతిపాదన ప్రధానంగా బీజేపీ నాయకుల నుండి, అలాగే కొంతమంది మేధావుల నుండి వచ్చింది. దేశంలో నదుల అనుసంధానానికి బీజం వేసింది వాజ్ పేయి. పోలవరం ప్రాజెక్టు ద్వారానే కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం సాధ్యమైంది. కాబట్టి, నదుల అనుసంధాన పితామహుడిగా ఆయన పేరు పెట్టడం సముచితమని బీజేపీ నేతలు వాదించారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దానికి పూర్తి నిధులు అందించే బాధ్యతను కేంద్రం తీసుకోవడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు NTR సాగర్ అని పేరు పెట్టాలని ప్రాథమికంగా భావించారు. వాజ్ పేయి మరణించిన సమయంలో ఆయనకు నివాళిగా రాష్ట్రంలోని ఏదైనా ఒక భారీ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలనే చర్చ టీడీపీలో జరిగింది. అప్పట్లో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నందున, పోలవరానికి వాజ్ పేయి పేరు పెట్టే ప్రతిపాదన వస్తే టీడీపీ వ్యతిరేకించే అవకాశం లేదు. వివాదాలు లేకుండా పోలవరం ప్రాజెక్టు గానే పిలవాలని నిర్ణయించి, అప్పటి వరకు ఉన్న ఇందిరా సాగర్ పేరును తొలగిస్తూ 2015లో జీవో ఇచ్చారు.
పొట్టి శ్రీరాములు పేరును ప్రతిపాదిస్తున్న జనసేన
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ పొట్టి శ్రీరాములు పేరును ప్రతిపాదించడంతో, వాజ్ పేయి లేదా ఎన్టీఆర్ పేర్లు రేసులో వెనుకడినట్లేనని అుకోవచ్చు. బీజేపీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఒకవేళ పొట్టి శ్రీరాములు పేరుపై ఏకాభిప్రాయం కుదిరితే వాజ్ పేయి పేరు కోసం పట్టుబట్టే అవకాశం తక్కువగా ఉండవచ్చు. బీజేపీ వాజ్ పేయి పేరు పెట్టాల్సిందేనని పై స్థాయిలో ఒత్తిడి చేస్తే అదే పేరు ఉంటుంది. ఎందుకంటే నిధులన్నీ కేంద్రానివే. లేకపోతే పవన్ కల్యాణ్ అభిప్రాయం మేరకు పొట్టి శ్రీరాములు పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. పోలవరానికి ఎవరి పేరు పెట్టాలనేది కేవలం గుర్తింపు సమస్య మాత్రమే కాదు, అది రాబోయే రోజుల్లో ఆయా పార్టీల సిద్ధాంతాలకు, ప్రాంతీయ సెంటిమెంట్లకు ప్రతీకగా మారనుంది.
