వల్లభనేని వంశీకి రోజులు బాగోలేవు. ఆయనపై ఉన్న అక్రమ మైనింగ్ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అక్రమ మైనింగ్ కేసులో గతంలో ముందస్తు బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం వాదనలు వినకుండానే హైకోర్టు వెంటనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గత విచారణలో అక్రమ మైనింగ్ పై పూర్తి వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది.
ప్రభుత్వం అన్ని వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. విచారణ తర్వాత ప్రభుత్వం వైపు వాదనలు వినకుండా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం సరి కాదని స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులు పక్కన పెడుతున్నట్లుగా స్పష్టం చేసింది. మళ్లీ ఇరు వర్గాల వాదనలు విని..మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే కేసు మెరిట్స్ లోకి.. పీటీ వారెంట్స్ అంశాల్లోకి వెళ్లడం లేదని తెలిపింది. కౌంటర్ దాఖలుకు వారం రోజులు.. ప్రభుత్వం సమయం కోరింది. ఆ తర్వాత నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలిపింది.
ముందస్తు బెయిల్ రద్దు కావడంతో.. వల్లభనేని వంశీని అరెస్టు చేయడానికి పోలీసులకు అవకాశం ఉంది. గతంలో పీటీ వారెంట్ జారీ చేశారు. కానీ ముందస్తు బెయిల్ రావడంతో దాని వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అరెస్టు చేయవచ్చు. కానీ పోలీసులు హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ పూర్తయ్యే వరకూ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని భావిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ జగన్ ను కలవడం.. వైసీపీ తరపున రాజకీయాలు చేస్తాడని.. పేర్ని నాని వంటి వాళ్లు ప్రకటిస్తూండటంతో ఏమైనా జరగవచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.