వల్లభనేని వంశీకి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కింది కోర్టు బెయిల్ ఇచ్చింది. పోలీసులు చార్జిషీటు దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవు. ఈ కేసులోనే ఆయన అరెస్టు అయి జైలుకు వచ్చారు. అయితే ఆ తర్వాత వంశీకి.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ రాలేదు. దాంతో పోలీసులు అరెస్టు చూపించారు. ఆ కేసులో బెయిల్ రావాల్సి ఉంది. ఇదొక్కటే కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయి.
వంశీపై మొదట టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నమోదు అయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూకల్ని ఉసిగొల్పి గన్నవరం టీడీపీ ఆఫీసును తగులబెట్టించారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయలేదు. కోర్టు నుంచి రక్షణ పొందారు. కానీ అసలు కేసునే బలహీనం చేద్దామన్న ప్లాన్ తో ఫిర్యాదు అయిన సత్యవర్ధన్ అనే యువకుడ్ని కిడ్నాప్ చేసి కథ నడిపించారు. అంత అమాయకంగా దొరికిపోవడంతో పోలీసులు మూడు నెలల కిందట అరెస్టు చేశారు.
కక్ష సాధింపు అనే భావన రాకుండా వంశీని అరెస్టు చేయడానికి ఆయనే అవకాశం ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. రకరకాల కారణాలతో పిటిషన్లు వేస్తున్నారు. అయినా రిలీఫ్ మాత్రం రావడం లేదు. ఇంకా ఎంత కాలం జైల్లో ఉండాలో కానీ.. ఆయన మాత్రం నలిగిపోతున్నారు.