వంగవీటి రంగా బంధువులు అంతా తెరపైకి వస్తున్నారు. ఎవరికి వారు అవకాశమున్న పార్టీల్లో లేదా ప్రత్యేక వేదికలు పెట్టి తమ రాజకీయ భవిష్యత్‌ను రంగా జయంతి, వర్థంతి సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వంగవీటి రంగా కుమారుడు రాధా ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. కానీ ఆయన తన అనుచరులకు అందుబాటులో ఉంటున్నారు. వీలైనంత వరకూ ఆయన అందరి మనిషి అనే పేరు తెచ్చుకుంటున్నారు. వివాదాస్పద రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. రాజకీయంగా మంచి రోజుల కోసం చూస్తున్నారు. ఇటీవల కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. టీడీపీలో ఆయనకు త్వరలో ముఖ్య పదవి లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
తాజాగా వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ తెరపైకి వచ్చారు. వంగవీటి రంగాకు కుమార్తె ఉన్నారనే చాలా మందికి తెలియదు. హఠాత్తుగా ఆమె తెరపైకి వచ్చి రాధా, రంగా మిత్రమండలిని యాక్టివేట్ చేసుకున్నారు. ఆమెను వైసీపీ తెరపైకి తెచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉంటానని చెబుతున్నారు కానీ ఏ పార్టీ అని చెప్పడం లేదు. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వీరికి తోడు చాలా కాలం నుంచి వంగవీటి నరేంద్ర అనే మరో బంధువు హడావుడి చేస్తూంటారు. కొన్నాళ్లు బీజేపీలో.. కొన్నాళ్లు వైసీపీలో ఉంటారు. యూట్యూబ్ లకు ఇంటర్యూలు ఇస్తూ వంగవీటి రంగా హత్యను ఏదో ఓ పార్టీకి పూసి.. తాను ఉన్న పార్టీకి మేలు చేసి.. తన పలుకుబడి పెంచుకోవాలనుకుంటారు. ఇప్పటికీ అవే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. గుర్తించేవారు లేరు. ముందు ముందు ఇంకెంత మంది రంగా బంధువులు వస్తారో కానీ .. ఒక రాజకీయ ఆయుధంగా ఆయనను మార్చుకుని తమ రాజకీయ భవిష్యత్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
