జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను ఆలస్యం చేసేలా ఎప్పటికప్పుడు నిందితులు ఒకరి తర్వాత ఒకరు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్లపై తీర్పులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు వాన్ పిక్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టి వేసింది. తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని..విచారణలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ … జగన్ అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకం. ఈ కేసులో నమోదైన ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు , ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్ ప్రాజెక్ట్ కోసం 12,973 ఎకరాల భూమిని కేటాయించారు. ఫలితంగా నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడుల రూపంలో లంచాలు ప్రవహింపచేశారు. నిమ్మగడ్డ 854 కోట్ల రూపాయలను జగన్ కంపెనీలలో లంచం రూపంలో పెట్టుబడిగా మళ్లించి, రాయితీలు, భూములను పొందారని సీబీఐ చార్జిషీట్లో వివరించారు.
నిమ్మగడ్డ ప్రసాద్ వాన్‌పిక్ కుట్రలో కీలక పాత్ర పోషించారని, 280 మంది సాక్షుల వాంగ్మూలాలు , 1,000కు పైగా డాక్యుమెంట్ల ఆధారంగా ఆరోపణలు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. 900 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇతరులకు అమ్మారని ఆరోపించింది. అయితే నిమ్మగడ్డ 13,000 ఎకరాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేశానని, జగన్ కంపెనీలలో పెట్టుబడులకు వాన్‌పిక్ ప్రాజెక్ట్‌తో సంబంధం లేదని వాదించారు. కానీ కోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవించింది.