శుక్రవారం విడుదలైన సినిమాల్లో ‘ఎస్.సరస్వతి’ ఒకటి. వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ కథ అందించారు. అయితే.. సినిమా విడుదలైన రోజే సోషల్ మీడియాలో బుర్రా ఓ కామెంట్ చేశారు. సరస్వతి పేరు ప్రస్తావించకుండానే..
”నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథ ని మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు.. అసలా కథే వేరు” అంటూ ఫేస్ బుక్ లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ఇది సరస్వతి సినిమా గురించే అని అందరికీ ఈజీగానే అర్థమైపోయింది.
దీనిపై ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు. బుర్రా సాయిమాధవ్ ఇచ్చిన కథలోని లైన్ ని మాత్రమే తీసుకొని, తాను కొత్త కథ రాసుకొన్నానని, స్క్రీన్ ప్లే చేసుకొన్నానని, అయినా బుర్రా సాయిమాధవ్ పై గౌరవంతో ఆయన పేరు వేశానని చెప్పుకొచ్చారు వరలక్ష్మి. స్టోరీ సిట్టింగ్స్ లో బుర్రా ఒక్కసారి కూడా అందుబాటులో లేరని, పెద్ద సినిమాలతో బిజీ అయిపోయి, తన సినిమాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కథ చెబుతున్నప్పుడు సెకండాఫ్ బాగోలేదని ఫీడ్ బ్యాక్ వచ్చిందని, క్లైమాక్స్ కూడా మార్చాల్సివచ్చిందని, అందుకోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. బుర్రా సాయిమాధవ్ దగ్గర ఏడెనిమిది ఏళ్లుగా ఈ కథ ఉండిపోయిందని, అంత బాగుంటే తనకు ఆ కథ ఎందుకు ఇచ్చేవారని ఎద్దేవా చేశారు. రచయితగా బుర్రా సాయిమాధవ్ కు పారితోషికం ఇచ్చేశానని, దానిపై ఇప్పుడు తనకు సర్వ హక్కులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ‘రేప్’ అనే పదం వాడకుండా ఉండాల్సిందని, బుర్రా లాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.
`సరస్వతి` అనే స్క్రిప్టుని బుర్రా సాయిమాధవ్ చాలా ఇష్టంగా తయారు చేసుకొన్నారు. ఆయనే దర్శకత్వం వహించాలనుకొన్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల వరలక్ష్మి మెగాఫోన్ అందుకోవాల్సివచ్చింది. ఇప్పుడు ఆ కథ.. ఇలా వివాదాస్పదం అయ్యింది.