మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు విజయాల కోసం అన్వేషణలో ఉన్నాడు. అందులో భాగంగా ఓ హారర్ కామెడీ సినిమా చేశాడు. అదే.. ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. రితికా నాయక్ కథానాయిక. సత్య కీలక పాత్రధారి. ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. సత్యని కొరియన్ పోలీసులు టార్చర్ పెట్టడం, సత్యని కాపాడడానికి వరుణ్ తేజ్ రావడం.. ఈ గ్లింప్స్ లో కనిపించాయి. వరుణ్ తేజ్ లో ఆత్మ ఆవహించడంతో.. ఈ కథాంశం ఎలాంటిదో, కథా నేపథ్యం ఏమిటో చూచాయిగా అర్థం అవుతున్నాయి. హారర్ సినిమాలు కొత్త కాదు కానీ, అలాంటి కథలో రాయలసీమకూ, కొరియాని ముడి పెట్టడమే కొత్తగా అనిపిస్తున్నాయి. సత్య ఉన్నాడు కాబట్టి, ఎలాగూ కామెడీకి ఢోకా ఉండదు. చాలా ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ పూర్తి చేసుకొన్న సినిమా ఇది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
తమన్ నేపథ్య సంగీతం అందించాడు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలవాటు ప్రకారం.. ఎక్కడో విన్నట్టే అనిపించింది. హారర్ జోనర్‌కి తిరుగు ఉండదు. భయం, థ్రిల్, వినోదం సమపాళ్లలో మేళవించగలగాలి. ఈ విషయాల్లో మేర్లపాక గాంధీ కి పట్టుంది. కాబట్టి.. వరుణ్ కి ఈసారి విజయం దొరుకుతుందన్న భరోసా కలుగుతోంది.
