ఇంటికి వాస్తు పాటిస్తే అన్నీ అనుకూలిస్తాయని, సమస్యలు లేకుండా ఉంటామని చాలామంది నమ్ముతారు. అయితే, వాస్తు శాస్త్రం అనేది అదృష్టాన్ని తెచ్చిపెట్టడం కోసం కాకుండా, సౌకర్యవంతమైన జీవన విధానాన్ని అందించడానికే ప్రధానం. అయితే సౌకర్యవంతమైన జీవనం వల్ల.. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించడం మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. అనవసర సమస్యలు రావు. ఈ కారణంగా వ్యక్తిగత జీవితంలోనూ మంచి ఫలితాలు వస్తాయి.
పరిసరాల ప్రభావం, ఇంటి నిర్మాణం, వినియోగ విధానాలు వాస్తు ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం మాత్రమే కాకుండా, దాని చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మానసిక ఆందోళనలకు దారితీయని పరిసరాల్లో స్థలం చూసుకోవడం ముఖ్యం. వాస్తు నియమాల ప్రకారం ఇల్లు నిర్మించడం ఒక్కటే సరిపోదు.. ఆ ఇంటిని ఎలా ఉపయోగిస్తామన్నది కూడా ముఖ్యం.
వాస్తు నేది ప్రకృతి , మానవ జీవనం మధ్య సమతుల్యతను సాధించడానికి రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ, ప్రకృతి సూత్రాలను విస్మరించలేమని నిపుణులు అంటున్నారు. వాస్తు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించడంతో పాటు, పరిసరాలతో సమన్వయం చేసే విధంగా ఇంటి నిర్మాణాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది.
వాస్తు శాస్త్రం కేవలం అదృష్టాన్ని తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించినది. అందుకే వాస్తు బాగా ఉందని తమ సమస్యలన్నీ తీరిపోతాయని అనుకోలేరు. తమ సమస్యలకు..వాస్తు కారణం అనుకోవడం కూడా అమాయకత్వం.