ఆంధ్రప్రదేశ్ ప్రజలపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో భారం మోపింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా.. లీటర్‌కు..రూపాయి నుంచి రెండు రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై.. 31 శాతానికిపైగా పన్ను విధిస్తున్నారు. అది సరిపోదని.. మరింత ఆదాయం కోసం మరో నాలుగు శాతం వరకూ పెంచారు. ఈ పెంపుదల వల్ల.. ప్రజల నుంచి నెలకు కొన్ని వందల కోట్లు ఖజానాకు జమ అవుతాయంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు బాదేసిన ఏపీ సర్కార్.. ఇప్పుడు పెట్రో ధరలు పెంచింది. కరెంట్ చార్జీలు పెంపు సహా.. ఆదాయం పెంచుకునేందుకు ఉన్న పన్నుల మార్గాలన్నింటినీ ప్రభుత్వం అన్వేషిస్తోంది.
నిజానికి చంద్రబాబు హయాంలోనే… దేశంలోనే పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక పన్నులు విధించేవారన్న విమర్శలు ఉండేవి. దీన్ని జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ప్రస్తావించారు. ఆయన తానొస్తే.. ఆ భారం ఉండదన్నట్లుగా చెప్పేవారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హయాంలో ఉన్న పన్నును కూడా ఉంచకుండా.. ఆదాయం కోసం మరింతగా పెంచుతున్నారు. ప్రజల నుంచి బాదేస్తున్నారు. అంతర్జాతీయ… పరిణామాల కారణంగా.. పెట్రోల్ రేటు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటుందో చెప్పడం కష్టమవుతంది. ఇలాంటి పరిణామాల్లో.. ప్రభుత్వం ఆదాయం కోసం.. పెట్రోల్, డీజిల్ వైపే చూడటం.. విమర్శలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… సంక్షేమం పేరుతో.. ప్రభుత్వ ఖజానాలో..మెజార్టీ నిధులను ప్రజలకు బదిలీ చేస్తోంది. ఈ కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఫలితంగా.. ఏపీ ఆదాయం కూడా పడిపోయింది. ఇలాంటి సమయంలో.. ప్రజలకు సంక్షేమం పేరుతో ఇచ్చిన డబ్బుల్నే.. ఇలా పన్నుల పెంపుతో రాబట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు లాయర్లకే రూ. ఐదు కోట్లు చెల్లిస్తూ.. దుబారాలో నెంబర్‌వన్‌గా ఉంటూ.. మరో వైపు ఈ పన్నుల పెంపేమిటన్న చర్చ కూడా సామాన్య ప్రజల్లో నడుస్తోంది.