హైదరాబాద్‌లో భూములు బంగారం అయిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకుని భూముల్ని గుంజుకునేవారికి కొదవ లేకుండా పోయింది. ఎంత బలవంతుడైతే అంత దౌర్జన్యం చేస్తున్నారు. తాజాగా కోకాపేట తర్వాత అలాంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ గా మారుతున్న వట్టినాగులపల్లిలో రాఘవ కన స్ట్రక్షన్స్ కంపెనీ తమ ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న ఐదు ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటనపై కేసులు నమోదయ్యాయి.
రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. ఆయన ఇటీవలి కాలంలో చాలా ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో వట్టినాగులపల్లి ప్రాజెక్టు ఒకటి . ఆ ప్రాజెక్టును ఆనుకుని ఉన్న భూమిపై వివాదాలు ఉన్నాయి. విషయం కోర్టులో ఉంది. అయితే హఠాత్తుగా నాలుగు రోజుల కిందట.. అర్థరాత్రి పూట నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో రాఘవ కన్స్ట్రక్షన్స్కు చెందిన వారు ఆ భూమిపై విరుచుకుపడి.. అన్నీ కులగొట్టారు. అందులో ఉన్న గోశాలను కూడా కూలగొట్టారు. దీంతో భూయజమానులు కేసులు పెట్టారు.
ఈ దౌర్జన్యంలో స్వయంగా పొంగులేటి కుమారుడు హర్షా పాల్గొన్నాడని ఫిర్యాదులు ఉన్నాయి. అయితే కేసులో మాత్రం ఆయన పేరు లేదు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ పేరు ఉంది. ఇతరుల పేర్లు ఉన్నాయి. అధికారంలో ఉన్న వారు తల్చుకుంటే పేర్లు తారుమారు చేయగలరు. అసలు కేసు లేకుండా చేయగలరు. కేసు నమోదు చేసినందుకు ఓ యువ ఐపీఎస్‌ను కూడా బదిలీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా రెవిన్యూ మంత్రి ఈ వివాదంతో మరింత విమర్శలకు గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది.