Veera Simha Reddy movie telugu review
తెలుగు360 రేటింగ్ 2.5/5
బాలకృష్ణ సూపర్ ఫామ్ లో వున్నారు. ఆయన గత చిత్రం ‘అఖండ’ విజయాన్ని ఇవ్వడమే కాదు కరోనా తర్వాత థియేటర్స్ కి పునర్వైభవం తెచ్చిన సినిమాల్లో ముందు వరుసలో నిలబడింది. ఈ సినిమాతో బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో మరోసారి తెలిసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని అలాంటి ఎలిమెంట్స్ తోనే ‘వీరసింహారెడ్డి’ రూపొందించాడని టీజర్, ట్రైలర్ చూస్తే అర్ధమైయింది. ఆయన కూడా క్రాక్ హిట్ తో మంచి ఫామ్ లో వున్నాడు. ప్యాక్షన్ కథలు బాలకృష్ణకి భలే నప్పుతాయి. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. బాలయ్య కెరీర్ లో మైలురాయి లాంటి సినిమాలు. ఈ రెండు సినిమాలు కలిపితే వచ్చే ఎనర్జీలో ‘వీరసింహారెడ్డి’లో ఉంటుందని యూనిట్ ఊరించింది. మరి ఇన్ని అంచనాలు మధ్య సంక్రాంతి బరిలో దిగిన ‘వీరసింహారెడ్డి’ అంచనాలు అందుకుందా ? బాలయ్య నుంచి ప్రేక్షకులు కోరునే అంశాలు వీరసింహా రెడ్డిలో కుదిరాయా ?
వీరసింహారెడ్డి(నందమూరి బాలకృష్ణ) సీమ కోసం బ్రతికే ఫ్యాక్షన్ నాయకుడు. తన కంటి చూపుతూతో కర్నూల్ ని రూల్ చేస్తుంటాడు. తనని నమ్ముకున్న ప్రజలకు ఎవరైనా కీడునితలపెడితే… తల తీసేస్తాడు. వీరసింహా ప్రత్యర్థి ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్). ప్రతాప్ రెడ్డి భార్య భాను(వరలక్ష్మీ శరత్ కుమార్). వీరిద్దరి లక్ష్యం వీరసింహారెడ్డిని చంపడం. అయితే భాను మరెవరో కాదు..వీరసింహారెడ్డికి స్వయానా చెల్లెలు. వీరసింహాని చంపడానికి సరైన అదునుకోసం ఎదురుచూస్తున్న భాను, ప్రతాప్ రెడ్డికి ఒక నిజం తెలుస్తుంది. వీరసింహారెడ్డి కొడుకు జై సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ), తల్లి మీనాక్షి (హనీ రోజ్) తో కలసి ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటాడు. కుటుంబాన్ని కలవడానికి ఇస్తాంబుల్ వెళ్తాడు వీరసింహా. వీరసింహాని చంపడానికి ఇదే సరైన సమయం అని భావించి తమ బలగం తో ఇస్తాంబుల్ వెళ్తారు భాను, ప్రతావ్ రెడ్డి. తర్వాత ఏం జరిగింది ? భాను, ప్రతావ్ రెడ్డిల పగ తీరిందా ? వీరసింహా రెడ్డిని చంపారా ? అసలు భాను సొంత అన్నపై ఎందుకు కక్ష కడుతుంది ? వీరసింహా రెడ్డి కుటుంబం ఎవరికీ తెలియకుండా ఇస్తాంబుల్ లో ఉండటానికి కారణం ఏమిటి ? అనేది మిగతా కథ.
బాలకృష్ణ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో దర్శకుడు గోపీచంద్ మలినేనికి క్లారిటీ వుంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్ ఆధారంగా బాలయ్యకి బాగా కలిసొచ్చిన ఒక ఫ్యాక్షన్ కథని సెట్ చేశాడు. ఇది వరకూ బాలకృష్ణ కొన్ని ప్యాక్షన్ సినిమాలు చేశారు. అయితే ఈ ఫ్యాక్షన్ కథకు చెల్లులు సెంటిమెంట్ ని జోడించి బాలకృష్ణ అభిమానులు కోరునే అన్ని ఎలిమెంట్స్ కథలో ఇమడ్చడానికి ప్రయత్నించాడు. గోపిచంద్ మలినేని ప్రయత్నం కొంతవరకూ సఫలమైయింది. ప్రతాప్ రెడ్డి పాత్రని ఒక క్రూరమైన సన్నివేశంతో పరిచయం చేసి.. వీరసింహాలో ఏ స్థాయి యాక్షన్ వుంటుందో తొలి సన్నివేశంలో చూపించాడు. తర్వాత ఇస్తాంబుల్ ట్రాక్ మొదలౌతుంది. అయితే అసలు కథ సీమలో వుండటం వలన.. ఇస్తాంబుల్ ట్రాక్ పై ప్రేక్షకుడికి పెద్ద ఆసక్తి వుండదు. జై సింహా ఎంట్రీ, ఫైట్ మాస్ కి నచ్చేలా డిజైన్ చేశారు. శ్రుతి హాసన్ సీన్స్ ని మరికాస్త ఆసక్తిగా డిజైన్ చేయాల్సింది. అయితే మరీ ఎక్కువ సమయం తీసుకోకుండానే సీమ కథలోకి వచ్చేస్తాడు దర్శకుడు. ఎప్పుడైతే వీరసింహారెడ్డి కథ మొదలౌతుందో ఇంక అక్కడి నుంచి సీన్లు పరుగుపెడతాయి. ప్రతాప్ రెడ్డి ప్రతి సారి వీరసింహా చేతిలో దెబ్బ తింటున్నప్పటికీ.. ఆ సన్నివేశాలని ఎక్కడా బోర్ కొట్టించకుండా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. బాలకృష్ణ డైలాగులు, ఫైట్లు,, ముఖ్యంగా చైర్ ఫైట్, ఇస్తాంబుల్ ఫైట్.. ఇవన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఇంటర్వెల్ కార్డ్ వరకూ సినిమా పరిగెడుతుంది.
అయితే వీరసింహా మూలకథకి బలమైన సంఘర్షణ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. ప్రాణంగా ప్రేమించిన అన్నయ్య ప్రాణం తీయాలని పగ పెంచుకున్న చెల్లెలి కథ ఇది. అయితే దర్శకుడు ఈ ప్రధాన సంఘర్షణపై మరింతగా వర్క్ చేయాల్సింది. భాను పగ పెంచుకోవడాని చూపించిన కారణం.. అంత బలంగా లేదు. పైగా అందులో కొత్తదనం లేదు. తొందరపాటు లో తప్పు చేయడం, ఆ తప్పుని సరిదిద్దుకోవడం, చెల్లి కోసం ప్రాణం ఇచ్చే అన్న.. ఇవన్నీ అరిగిపోయిన ఫార్ములాలు. దర్శకుడు దాన్నే నమ్ముకున్నాడు. దీంతో సెకండ్ హాఫ్ అంతా ప్రేక్షకుడి ఊహకు అందిపోతుంది. ఇంత రొటీన్ కథని కూడా బాలకృష్ణ మాస్ ఇమేజ్, వరలక్ష్మీశరత్ కుమార్ ప్రజన్స్ హుందాతనాన్ని తీసుకొచ్చాయి. భాను పాత్రని ముగించిన తీరు ఎమోషన ల్ గా వుంటుంది . ”నన్ను క్షేమించే మనిషి ఈ ఇంట్లో లేడు” అని భాను పాత్ర చెబుతుంటే.. అప్పటి వరకూ పాత్రలో వున్న కొన్ని లోపాలు కాసేపు మాయమైపోయి కంట్లో నీళ్ళు తిరిగేలా చేస్తాయి. ఇలాంటి కథలకు మిగింపు శత్రు సంహారమే. వీరసింహా కథ కూడా రొటీన్ గానే శత్రు సంహారంతో ముగుస్తుంది.
సీమకథలకు చిరునామా బాలకృష్ణ. మరోసారి సీమకథలో తన గ్రేస్ చూపించారు. ఇందులో బాలకృష్ణ మూడు దశల్లో కనిపిస్తారు. తెల్ల చొక్కాలో తన రాజసం కనిపిస్తుంది. గొడ్డలి పట్టుకొని వస్తుంటే.. సమరసింహా రెడ్డి గుర్తుకు వస్తాడు. నల్ల చొక్కాలో కనిపించే బాలయ్య మాస్ వేరే లెవెల్ వుంటుంది. జైసింహా రెడ్డిగా కాస్త యంగ్ లుక్ లో కనిపించే ప్రయత్నం కూడా జరిగింది. అయితే నల్లా చొక్కా దశలో బాలయ్య చెప్పే డైలాగులు, యాక్షన్ ఫ్యాన్స్ కి పండగలా వుంటాయి. ఇందులో ఒక చైర్ ఫైట్ వుంటుంది. అది కేవలం బాలయ్యకే చెల్లింది. ఎమోషన్ సీన్లు నటిస్తున్నపుడు ఆయన అనుభవం మరోసారి తెరపై కనిపించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తన ప్రజన్స్ తో ఆకట్టుకుంది. పాత్రని తీర్చిదిద్దిన తీరు బలహీనంగా ఉన్నప్పటికీ తన నటనతో హుందాతనాన్ని తీసుకొచ్చింది. దునియా విజయ్ క్రూరంగా కనిపించాడు. శ్రుతి హాసన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ఆమె చేసిన డ్యాన్సులు బాగున్నాయి. హానీ రోజ్ కి మంచి పాత్ర దక్కింది, చంద్రిక రవి ఐటెం పాటలో మెరిసింది. నవీన్ చంద్ర పాత్ర నిడివి తక్కువే కానీ కీలకం. అజయ్ ఘోస్ చిన్న పాత్రలో కనిపించినా తన డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్నాడు. మురళి శర్మ, ఈశ్వరీ రావ్ మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
తమన్ మరోసారి విజ్రుంభించాడు. జై బాలయ్య, మాస్ మొగుడు, మనోభావాలు, పాటలు బావున్నాయి, నేపధ్య సంగీతంతో సీన్స్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. రుషి పంజాబీ కెమరాపనితనం బావుంది. ఎడిటర్ సెకండ్ హాఫ్ ని కొంచెం ట్రిమ్ చేసే ఛాన్స్ వుంది. సాయి మాధవ్ బుర్రా మాటలు బావున్నాయి. ఫ్యాన్స్ ని అలరించాయి. హోమ్ మినిస్టర్ దగ్గర రాజకీయాలు గురించి బాలయ్య చెప్పే డైలాగులకు విజల్స్ పడతాయి. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయంపై అవగాహన వున్న ప్రతి ఒక్కరు ఈ డైలాగులుకు కనెక్ట్ అవుతారు. అయితే ఈ డైలాగులు బలవంతంగా పెట్టినట్లు వుండదు. కథ నుండి పుట్టే మాటలివి. అందుకే థియేటర్స్ లో అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ”మూతి మీద మోలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా”. నువ్వు సవాల్ విసిరితే నేను శవాల్ విసురుతా” ఇలాంటి డైలాగులు చాలానే వున్నాయి. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’అనే చెప్పే డైలాగ్ కి కూడా మంచి రెస్పాన్ వచ్చింది.
దర్శకుడు గోపీచంద్ మలినేని కేవలం బాలయ్య ఇమేజ్ ని ద్రుష్టి పెట్టుకునే ఈ కథని రాసుకున్నాడు. ప్రతి చోట ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల ఇది బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఇంకొన్ని చోట్ల మాత్రం అవసరం లేని చోట కూడా ఎలివేషన్ ఇచ్చిన భావన కలుగుతుంది. అఖండ ని ద్రుష్టిలో పెట్టుకొని ఇలా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. అయితే అఖండ పాత్ర ఎలివేషన్ ని డిమాండ్ చేస్తుంది కాబట్టి సహజంగా అనిపించింది. వీరసింహా మాత్రం అఖండ స్థాయి ఎలివేషన్ డిమాండ్ చేసే పాత్ర ఐతే కాదు. కొన్ని యాక్షన్ సీన్లు బోయపాటి పూనినట్లు తీయడం కూడా గమనించ వచ్చు. ఫస్ట్ వరకూ వీరసిసింహాని వీరవిహారం చేయించడంలో గోపి సఫలమయ్యాడు. సెకండ్ హాఫ్ పై కాస్త ద్రుష్టి పెట్టుంటే వీరసింహా ఇంకా అదిరిపోయేవాడు.
ఫినిషింగ్ టచ్ : ‘వీర’ ఫాన్స్ కి మాత్రమే
తెలుగు360 రేటింగ్ 2.5/5